Marijuana Smuggler: గంజాయి పుష్ప
ABN, First Publish Date - 2023-08-18T04:07:16+05:30
అతడి వాహనానికి పోలీస్ సైరన్(Police Siren) ఉంటుంది! సందర్భాన్ని బట్టి కారుపై ప్రభుత్వ ఉన్నతాధికారుల స్టిక్కర్లు కూడా ఉంటాయి! ఆ స్టిక్కర్లను అతికించుకుని.. కుయ్‌కుయ్‌మనే పోలీస్ సైరన్‌తో.. ఖరీదైన కారులో దర్జాగా కూర్చుని రయ్‌మంటూ దూసుకుపోతూ హల్‌చల్ సృష్టిస్తుంటాడు!!
ఖరీదైన కార్లలో ప్రత్యేక అరల ద్వారా స్మగ్లింగ్
తనిఖీల నుంచి తప్పించుకోవడానికి కార్లపై
పోలీసు ఉన్నతాధికారుల స్టిక్కర్లు, సైరన్లు
విశాఖలో కిలో గంజాయి రూ.4 వేలకు కొని
మహారాష్ట్రలో రూ.20 - 25 వేలకు అమ్మకం
ప్రతి ట్రిప్పులోనూ 100 కేజీల దాకా సరఫరా
కోట్లకు పడగలెత్తిన హైటెక్ గంజాయి స్మగ్లర్
తెలంగాణలో అరెస్ట్.. కార్లు, గంజాయి స్వాధీనం
హైదరాబాద్ సిటీ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): అతడి వాహనానికి పోలీస్ సైరన్(Police Siren) ఉంటుంది! సందర్భాన్ని బట్టి కారుపై ప్రభుత్వ ఉన్నతాధికారుల స్టిక్కర్లు కూడా ఉంటాయి! ఆ స్టిక్కర్లను అతికించుకుని.. కుయ్‌కుయ్‌మనే పోలీస్ సైరన్‌తో.. ఖరీదైన కారులో దర్జాగా కూర్చుని రయ్‌మంటూ దూసుకుపోతూ హల్‌చల్ సృష్టిస్తుంటాడు!! అంతటి డాబు, దర్పం ప్రదర్శిస్తున్న వ్యక్తి ఏ ఉన్నతాధికారో లేక ప్రజా ప్రతినిధో అనుకుంటున్నారా? కాదు.. అతడో గంజాయి స్మగ్లర్(Marijuana Smuggler). తక్కువ ధరకు లభించే డ్రగ్‌గా గుర్తింపు పొందిన గంజాయిని ఇక్కడి నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తూ కోట్లకు పడగలెత్తాడు. తన దందాపై పోలీసులకు, అధికారులకు... వాహనాల తనిఖీలు జరిగే చెక్‌పాయింట్లు, టోల్‌గేట్ల సిబ్బందికి అనుమానం రాకుండా ‘పుష్ప’ సినిమా('Pushpa' movie)లో అల్లు అర్జున్(Allu Arjun) రేంజిలో ప్లాన్ వేశాడతడు! టాటా హెక్సా, ఎంజీ హెక్టర్, హ్యుండయ్ వెర్నా, ఫార్చ్యూనర్, ఇన్నోవా, క్రిస్టా వంటి ఖరీదైన కార్లలో ప్రత్యేకంగా అరలు తయారు చేయించి.. వాటిలో గంజాయి సర్ది మహారాష్ట్రకు సరఫరా చేస్తున్నాడు. దీంతో స్మగ్లర్ వెంకన్న సంపాదనకు హద్దు లేకుండా పోతోంది.
మహారాష్ట్ర(Maharashtra)లో ఓ డీలర్‌తో వ్యాపార సంబంధాలు పెంచుకుని.. ఇక్కడ వ్యాపారాల్లో కూడా పెట్టుబడులు పెట్టాడు. అయితే, అతడి నేరచరిత్ర గురించి ఉప్పందడంతో తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీఎ్‌సన్యాబ్) అధికారులు లంగర్‌హౌజ్(Langerhouse) పోలీసులతో కలిసి వల వేసి అతణ్ని పట్టుకున్నారు. వెంకన్నతో పాటు గంజాయి దందాలో అతనికి సహకరించిన మరో ఐదుగురిని కూడా టీఎ్‌సన్యాబ్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 44 కేజీల గంజాయి, నాలుగు భారీ కార్లు, రూ.12 లక్షల నగదు మొత్తం రూ. కోటి విలువైన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం, ఏపూరు గ్రామానికి చెందిన వంకుడోత్ వెంకన్న(33) అలియాస్ వీరు 2006లో పదో తరగతి పరీక్షల్లో తప్పాడు. ఆ తర్వాత నగరానికి వచ్చి.. ఓయూ హాస్టల్లో వరసకు సోదరుడి గదిలో ఉంటూ 2009లో ఎస్‌ఎ్‌ససీ పూర్తి చేశాడు.
2013లో అన్నమాచార్య ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సె్‌సలో ట్రిపుల్ ఈ డిప్లొమా పూర్తి చేశాడు. ఆ సమయంలో సూర్యాపేటలో నివాసం ఉండే తన మేనమామ తేజావత్ చందా (70) వద్దకు తరచూ వెళ్తుండేవాడు. చందా అప్పటికే గంజాయి సరఫరా వ్యాపారంలో ఉండటం.. ఈజీగా డబ్బులు సంపాదించడం చూసి వెంకన్న కూడా గంజాయి దందా మొదలు పెట్టాడు. ఖరీదైన కార్ల సీట్ల కింద, బాడీకి పైన చిన్నచిన్న అరలు తయారుచేయించాడు. ఆటోనగర్‌లోని ఓ వెల్డింగ్ షాపు వద్దకు ఆ కార్లను తీసుకెళ్లి.. సీట్ల కింద.. బాడీకిపైన చిన్న చిన్న అరలు తయారు చేయించాడు. ఆ కార్లను నడిపేందుకు డ్రైవర్లను నియమించుకున్నాడు. విశాఖపట్నం నుంచి ప్రతి ట్రిప్పులో కారులో 100 కేజీల గంజాయి.. 10 కేజీలు.. 5 కేజీల చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి వాటిని కార్ల అరల కింద అమర్చి దర్జాగా తీసుకొచ్చేస్తాడు. అలా వారంలో రెండు సార్లు విశాఖ నుంచి గంజాయి తరలిస్తుంటాడని పోలీస్ విచారణలో వెల్లడైంది. ఈ దందాలో అతనికి సహకరించిన ఇద్దరు డ్రైవర్లు మహబూబాబాద్ జిల్లాకు చెందిన అజ్మీర వెంకన్న (21), సుర్మేని మనోజ్ (20)తో పాటు, మరో ఇద్దరు వ్యాపారులు మెరుగు మధు (39, మహబూబాబాద్ జిల్లా), మహమ్మద్ జహంగీర్ (40, మహబూబ్‌నగర్ టౌన్)ను అరెస్టు చేశారు.
Updated Date - 2023-08-18T06:09:28+05:30 IST