Mumbai : మోదీ హై సెక్యూరిటీ జోన్‌లోకి చొరబడిన వ్యక్తి అరెస్ట్
ABN, First Publish Date - 2023-01-21T17:20:17+05:30
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ముంబైలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో అత్యంత కట్టుదిట్టమైన
ముంబై : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ముంబైలో గురువారం నిర్వహించిన బహిరంగ సభలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలోకి చొరబడిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) పేరుతో ఫోర్జరీ చేసిన గుర్తింపు కార్డును చూపిస్తూ, రామేశ్వర్ మిశ్రా (35) వీవీఐపీ సెక్షన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినపుడు ఆయనను అరెస్ట్ చేశామన్నారు. సభా ప్రాంగణానికి మోదీ చేరుకోవడానికి 90 నిమిషాల ముందు ఈ సంఘటన జరిగినట్లు తెలిపారు.
బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, మోదీ గురువారం ముంబైలోని బాంద్రా కుర్లాలోని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆయన ఈ మైదానానికి చేరుకోవడానికి 90 నిమిషాల ముందు రామేశ్వర్ మిశ్రా వీవీఐపీ జోన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడాన్ని భద్రతా సిబ్బంది గుర్తించారు. ఆయనను ప్రశ్నించినపుడు, భారత సైన్యంలోని గార్డ్స్ రెజిమెంట్‌లో తాను సైనికుడినని మిశ్రా చెప్పారు. దీంతో మిశ్రాపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
ఇదిలావుండగా, భారత సైన్యం, ఇంటెలిజెన్స్ బ్యూరో, ఢిల్లీ పోలీసులు, ప్రధాన మంత్రి భద్రతా కార్యాలయం కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. మిశ్రా ఎందుకు మోదీ భద్రతా వలయంలోకి ప్రవేశించాలనుకున్నారో ఆరా తీస్తున్నాయి. నిందితుడు మిశ్రాను శుక్రవారం బాంద్రా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనను ఈ నెల 24 వరకు పోలీస్ కస్టడీకి ఆదేశించింది.
మోదీ గురువారం ముంబైలో సుమారు రూ.38,800 కోట్ల విలువైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
Updated Date - 2023-01-21T17:20:21+05:30 IST