Kejriwal and Pawar : శరద్ పవార్‌తో కేజ్రీవాల్ భేటీ
ABN, First Publish Date - 2023-05-25T17:17:25+05:30
ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు
ముంబై : ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్టింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలను కలిసి మద్దతు కోరుతున్నారు. ఆయన మంగళవారం నుంచి ముంబైలో పర్యటిస్తూ, శివసేన (యూబీటీ), ఎన్‌సీపీ నేతలను కలిసి, తనకు సంఘీభావం తెలపాలని కోరుతున్నారు. అంతకుముందు ఆయన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీతో కూడా సమావేశమయ్యారు.
కేజ్రీవాల్ (Delhi Chief Minister Arvind Kejriwal) గురువారం ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar)తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అతిషి, రాఘవ్ ఛద్దా, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా పాల్గొన్నారు. ముంబైలోని యశ్వంత్‌రావ్ చవాన్ సెంటర్‌లో ఈ సమావేశం జరిగింది.
కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతల బృందం బుధవారం శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ఉద్ధవ్ థాకరేతో సమావేశమైన తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీ చేయడాన్నిబట్టి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టుపై నమ్మకం లేదని అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టేందుకు కేంద్రం సీబీఐ, ఈడీలను వాడుకుంటోందన్నారు. థాకరే మాట్లాడుతూ, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవారిని ఓడించడానికే తాము కలిశామని చెప్పారు. ఈసారి అవకాశాన్ని వినియోగించుకోకపోతే, దేశంలో ప్రజాస్వామ్యం ఉండదని చెప్పారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికే తాము కలిశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు.
అధికారులపై నియంత్రణ కోసం ఆర్డినెన్స్
ఢిల్లీ రాష్ట్రంలోని గ్రూప్-ఏ అధికారుల పోస్లింగ్, బదిలీల కోసం ప్రత్యేకంగా ఓ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఓ ఆర్డినెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం గత శుక్రవారం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ, ఈ చర్య తీసుకోవడమంటే, సర్వీసెస్ కంట్రోల్‌పై సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కడమేనని ఆరోపించింది.
సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?
ఢిల్లీలో పోలీసు, ప్రజా భద్రత, భూములు మినహా మిగిలిన శాఖలపై నియంత్రణాధికారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. దీనిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ ఆర్డినెన్స్‌ను జారీ చేసి, ఈ అధికారాలను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెట్టింది.
ఉద్ధవ్ థాకరేతో సమావేశానికి ముందు కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ (Mamata Banerjee)తో కోల్‌కతాలో సమావేశమయ్యారు.
ఇవి కూడా చదవండి :
Amul : తమిళనాడులో అమూల్ పాల సేకరణ మానుకోవాలి : స్టాలిన్
Delhi Development : మోదీ హయాంలో రూ.1.5 లక్షల కోట్లతో ఢిల్లీ అభివృద్ధి : బీజేపీ
Updated Date - 2023-05-25T17:17:25+05:30 IST