AAP:కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తే.. జైలు నుంచే పరిపాలన సాగిస్తాం: సౌరభ్ భరద్వాజ్
ABN, First Publish Date - 2023-11-01T16:47:58+05:30
ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని(CM Kejriwal) ఈడీ అరెస్ట్ చేస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ప్రభుత్వం జైలు నుంచే పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు.
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor Scam) కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని(CM Kejriwal) ఈడీ అరెస్ట్ చేస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ప్రభుత్వం జైలు నుంచే పని చేస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత సౌరభ్ భరద్వాజ్ అన్నారు. కేజ్రీవాల్ ని అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నవంబర్ 2న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయాలని చూస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగా విచారణ కోసం రేపు ఉదయం రావాలని ఈడీ(ED) అధికారులు ఆదేశించినట్లు తెలిపారు. కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం అరెస్టు చేసే అవకాశం ఉందని ఆప్ మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్, మరో ఇద్దరు సీనియర్ ఆప్ నేతలు ఇప్పటికే జైలులో ఉన్నారు. కేజ్రీవాల్ జైలుకు వెళితే పార్టీ వ్యూహం ఏంటనే ప్రశ్నకు స్పందించిన భరద్వాజ్.. అంతర్గతంగా చర్చించి నేతలు భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తారని చెప్పారు.
"పార్టీ నేతలంతా జైలులో ఉంటే, అప్పుడు ప్రభుత్వం, పార్టీ జైలు నుంచి పని చేస్తాయి. బీజేపీ(BJP) కోరుకుంటోంది అదే. ఉచిత విద్య, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిలిపివేయాలని వారు కోరుకుంటున్నారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ కుట్రలను సాగనివ్వరు. బీజేపీకి ఎవరు అడ్డంకిగా మారారో వాళ్లను వాళ్ల పార్టీ నేతలను ఏదో విధంగా జైలుకు పంపుతారు. ఆ పార్టీ హయాంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ఏళ్లతరబడి జైళ్లలో మగ్గుతూ శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను చూస్తున్నాం. ఈ టైంలో చట్టాన్ని నమ్ముకుంటాం. చట్టాలను దుర్వినియోగం చేయడానికి బీజేపీ ప్రయత్నించినా.. కోర్టులు ఆ పార్టీకి మొట్టికాయలు వేస్తాయి”అని అన్నారు. ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. "బీజేపీ ఇండియా కూటమి నేతల అరెస్టులే టార్గెట్ గా పని చేస్తోంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఓడించలేకపోయారు కాబట్టి వారు ఆయన్ని తరువాతి టార్గెట్ గా ఎంచుకున్నారు. బిహార్‌లో కూటమిని విచ్ఛిన్నం చేయలేకపోయారు కాబట్టి తేజస్వీ యాదవ్‌ను టార్గెట్ చేస్తారు. తదనంతరం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను టార్గెట్ చేస్తారు" అని అతిషి ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఏప్రిల్ 16న కేజ్రీవాల్‌ను సీబీఐ ప్రశ్నించింది. అప్పటి నుంచి ఆప్ తో పాటు ఈ కేసులో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కుంటున్న చాలా మంది నేతలు అరెస్ట్ అయ్యారు.
Updated Date - 2023-11-01T16:47:58+05:30 IST