Akhilesh Yadav: కేసీఆర్‌తో పాటు ఆ ఇద్దరు కూడా యత్నిస్తున్నారు
ABN, First Publish Date - 2023-03-19T17:39:13+05:30
భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) యత్నిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) చెప్పారు.
కోల్‌కతా: 2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) ని ఓడించేందుకు భారత్ రాష్ట్ర సమితి(BRS) అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి(Telangana CM) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) యత్నిస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ(Samajwadi Party) అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) చెప్పారు. కేసీఆర్‌తో పాటు తృణమూల్(TMC) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి (West Bengal CM) మమతా బెనర్జీ, జెడియూ(JDU) అధినేత బీహార్ ముఖ్యమంత్రి(Bihar CM) నితీశ్ కుమార్(Nitish Kumar) కూడా బీజేపీ(BJP) ఓడించేందుకు కృషి చేస్తున్నారని చెప్పారు. తనతో సహా మిగతా పార్టీల నేతలు బీజేపీని ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని అఖిలేష్ చెప్పారు. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతా(Kolkata)లో జరుగుతోన్న సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు కూడా సొంత పార్టీ పాత్రపై స్పష్టత రావొచ్చన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బలమైన ప్రతిపక్షంగా లేదని అఖిలేష్ చెప్పారు. అన్ని పార్టీలూ కలిసి కేంద్రంలో బీజేపీ రాకుండా అడ్డుకుంటామన్నారు.
కోల్‌కతాలో ఉన్న ఆయన ఇప్పటికే మమతాబెనర్జీని కలుసుకుని చర్చలు జరిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. వీరిద్దరూ కాంగ్రెస్‌కు, బీజేపీకి సమదూరం పాటిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ నేతృత్వాన్ని వీరిద్దరూ ఇష్టపడటం లేదు. కాంగ్రెస్‌కు అంత సీన్ లేదనేది అఖిలేష్ అభిప్రాయమైతే మమత మరో అడుగు ముందుకేసి కాంగ్రెస్ నేతృత్వాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు పశ్చిమబెంగాల్‌లోని సాగర్దిగి(Sagardighi) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తృణమూల్ అభ్యర్ధిని కాంగ్రెస్ (Congress) పార్టీ ఓడించింది. తృణమూల్ అభ్యర్ధి దేబాశీష్ బెనర్జీని కాంగ్రెస్ బేరోన్ బిశ్వాస్ చిత్తుగా ఓడించారు. కాంగ్రెస్-సీపీఎం-బీజేపీ అనైతిక పొత్తు వల్లే కాంగ్రెస్ అభ్యర్ధి గెలుపొందారని మమత ఆరోపించారు. బీజేపీ(BJP) ఓట్లన్నీ కాంగ్రెస్ అభ్యర్ధికి పడేలా కుట్ర చేశారని దీదీ ఆరోపించారు. సాగర్దిగి తమ పార్టీ అభ్యర్థి ఓటమితో షాక్‌లో పడిపోయిన దీదీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ఎవ్వరితోనూ పొత్తు పెట్టుకోబోమని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి దీదీ అతి పెద్ద షాకిచ్చారు. తాము కాంగ్రెస్‌తో చేతులు కలిపేదే లేదన్నారు. మమత ఈ నెలాఖరులో ఢిల్లీలో పర్యటిస్తారని టీఎంసీ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలే(2024 Lok Sabha elections) లక్ష్యంగా ఆమె పావులు కదపనున్నారు. ప్రతిపక్ష నేతలను కలిసి భవిష్యత్‌లో కలిసి చేపట్టాల్సిన అంశాలపై వ్యూహరచన చేయనున్నారు. ఢిల్లీ టూర్‌లో భాగంగా మమత ప్రతిపక్షనేతలను కలిసినా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని మాత్రం కలవబోరని ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఆమె కలవబోరని తెలుస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో(2024 Lok Sabha elections) ఒంటరిగా వెళ్తామంటూ మమత చేసిన ప్రకటన కాంగ్రెస్‌కు శరాఘాతంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో బీజేపీకి మేలు చేసే అవకాశం కూడా ఉంది. గత లోక్‌సభ ఎన్నికల్లో(2019) బీజేపీ 18 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని తృణమూల్‌కు గట్టి సవాల్ విసిరింది. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూటమిగా నిలవకపోతే కమలనాథుల హవాను అడ్డుకోవడం కష్టమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కాంగ్రెస్, తృణమూల్, వామపక్షాలు వేర్వేరుగా పోటీచేస్తే బీజేపీకి మేలు జరిగే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ అంటే ఏమాత్రం గిట్టని మరో నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా మమత, అఖిలేష్, కేసీఆర్ వెంటే ఉన్నారు. తన పార్టీని కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్థాయిలో తీసుకెళ్లేందుకు యోచిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ను కాంగ్రెస్ పార్టీనుంచి గెలుచుకున్న ఆయన మరిన్ని రాష్ట్రాల్లో పాగా వేయడానికి యత్నిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(KCR) ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకంగానే కనపడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలయ్యే వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపే అవకాశం లేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి కాంగ్రెస్‌తో చేతులు కలపాలా వద్దా అనేది కేసీఆర్ నిర్ణయించనున్నారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడియూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ(RJD) అధినేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్, ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్, శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరే, నేషనల్ కాన్ఫరెన్స్(NC) అధినేత ఫరూఖ్ అబ్దుల్లా, జేఎంఎం పార్టీ హేమంత్ సొరేన్ మాత్రమే కాంగ్రెస్ సారధ్యాన్ని కోరుకుంటున్నారు. బీహార్, జార్ఖండ్‌లో కాంగ్రెస్‌తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ పార్టీ శక్తి సామర్థ్యాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్‌ను 50 స్థానాల లోపే కట్టడి చేయాలని కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీయేతర పార్టీల మధ్య ఐక్యత లేకపోవడం, ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలకపోవడం కూడా బీజేపీ నేతలకు కలిసిరానుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
Updated Date - 2023-03-19T17:40:20+05:30 IST