Amit Shah: అమిత్‌షా సంచలన కామెంట్స్.. ఆయన్ను చేర్చుకోవాలని ఒత్తిడి చేయం..
ABN, First Publish Date - 2023-05-05T08:06:06+05:30
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
చెన్నై, (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేలో మాజీ ముఖ్యమంత్రి ఒ. పన్నీర్‌సెల్వం (O. Panneerselvam)ను చేర్చుకోమంటూ తామెలాంటి ఒత్తిడి చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) స్పష్టం చేశారు. అమిత్‌షా ప్రకటన పట్ల అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) వర్గీయులు హర్షం ప్రకటించగా, ఓపీఎస్ వర్గం దిగ్ర్భాంతి చెందింది. ఇటీవల ఈపీఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఢిల్లీ వెళ్ళి అమిత్‌షాను కలుసుకుని రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించారు. ఆ సందర్భంగా అన్నాడీఎంకేలో ఓపీఎస్‌ను చేర్చుకోమంటూ అమిత్‌షా, బీజేపీ జాతీయ కమిటీ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఈపీఎస్‌పై ఒత్తిడి చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఓపీఎస్, ఆయన వర్గీయులు అన్నాడీఎంకేలో చేరేందుకు ప్రయత్నించారంటూ ఈపీఎస్ పార్టీ సమావేశంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న అమిత్‌షా విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓపీఎస్‌ను పార్టీలో చేర్చుకోవాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవాల్సింది అన్నాడీఎంకే అధిష్టానవర్గమేనని, ఈ వ్యవహారంలో బీజేపీ తలదూర్చదని స్పష్టం చేశారు. ఈపీఎస్, ఓపీఎస్ మధ్య జరుగుతున్న వివాదాల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని, వారిద్దరూ చర్చలు ద్వారా సమస్య పరిష్కరించుకుంటే మంచిదన్నారు. అమిత్‌షా తాజాగా చేసిన ఈ ప్రకటనతో బీజేపీ మద్దతు ఓపీఎస్‌కు ఏ మాత్రం లేదని స్పష్టమైనట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఈపీఎస్ వర్గీయులు చెబుతున్నారు. ఈ విషయమై అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సేలం మణికంఠన్ మాట్లాడుతూ బీజేపీ మద్దతు తమ నాయకుడు ఈపీఎస్‌కే ఉందని, ఓపీఎస్(OPS) వర్గీయులకు పార్టీలో ఇసుమంత బలం కూడా లేదని ఆ పార్టీ జాతీయ నాయకులందరికీ తెలుసునన్నారు. బీజేపీ అధిష్టానవర్గం ఆశీస్సులు తమకేనని చెప్పుకుంటూ వచ్చిన ఓపీఎస్ వర్గీయులు అమిత్‌షా చేసిన ప్రకటన తీవ్ర నిరాశకు గురిచేసింది. ప్రస్తుతం పార్టీ భవిష్యత్ అగమ్యగోచరంగా మారినట్లు ఓపీస్ వర్గానికి చెందిన కొందరు సీనియర్ నేతలు వాపోతున్నారు.
Updated Date - 2023-05-05T08:06:06+05:30 IST