Antilia Bomb Scare Case : అంబానీ నివాసం వద్ద బాంబు కేసులో సంచలన పరిణామం
ABN, First Publish Date - 2023-03-09T16:30:06+05:30
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం ఆంటిలియా (Antilia) వద్ద బాంబు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు,
ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ (Mukesh Ambani) నివాసం ఆంటిలియా (Antilia) వద్ద బాంబు పెట్టిన కేసులో ప్రధాన నిందితుడు, డిస్మిస్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజే (Sachin Waze) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసులో అన్ని వివరాలను పూర్తిగా న్యాయస్థానం సమక్షంలో వెల్లడిస్తానని ఆయన తన న్యాయవాది ఆర్తి కాలేకర్‌కు రాసిన లేఖలో తెలిపారు. పరిస్థితుల వల్ల తాను బాధితుడనయ్యానని, అనవసరంగా నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నానని పేర్కొన్నారు.
ముఖేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కట్టుదిట్టమైన భద్రత ఉంటుందని, వారు ప్రైవేటు వ్యక్తులని తనకు తెలుసునని సచిన్ వాజే ఈ లేఖలో తెలిపారు. అలాంటివారిని బెదిరించడం, అది కూడా పేలని, తక్కువ నాణ్యతగల పేలుడు పదార్థాలతో, సంబంధం లేని అనామక లేఖతో బెదిరించడం అత్యంత హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఇటువంటి నేరానికి పాల్పడాలని తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కనీసం ఊహించలేనని తెలిపారు.
గొప్ప డిటెక్టివ్/ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అనే గుర్తింపును తాము మళ్లీ పొందాలనుకున్నానని ఛార్జిషీట్‌లో ఎన్‌ఐఏ ఆరోపించిందన్నారు. తనను ఉద్యోగంలో పునరుద్ధరించిన తర్వాత 9 నెలల్లో (2020 జూన్ నుంచి 2021 మార్చి వరకు) గ్రేటర్ ముంబై పోలీస్ ఫోర్స్‌లో తాను అత్యున్నత స్థాయి పనితీరు కనబరచిన అధికారినని తెలిపారు. తన పేరు, ప్రతిష్ఠలను తిరిగి పొందడం కోసం నేరానికి పాల్పడాలనే ఆలోచన తనకు లేదన్నారు. మన్‌సుఖ్ హిరన్‌ను హత్య చేయాలనే ఉద్దేశం తనకు ఉన్నట్లు నిరూపించే సాక్ష్యాధారాలేవీ లేవని తెలిపారు. ఆయనను తనకు తెలుసునని, ఆయనను తాను తప్ప ఇతరులు చాలా మంది వేధించేవారని, ఇది వాస్తవమని తెలిపారు. ఈ కేసులో నిందితుడు, డిస్మిస్ అయిన పోలీసు అధికారి ప్రదీప్ శర్మకు బెయిలు మంజూరు చేసినపుడు వాజేకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడిందని గుర్తు చేశారు. ఈ కేసులోకి తనను అనవసరంగా లాగారని తాను రెండేళ్ళ నుంచి చెప్తున్నానన్నారు.
పేలుడు పదార్థాలు ఉన్న ఓ స్కార్పియో వాహనాన్ని పోలీసులు 2021 ఫిబ్రవరి 25న ముఖేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో గుర్తించిన సంగతి తెలిసిందే. 2021 మార్చి 4న ఈ వాహనం యజమాని హిరన్ హత్యకు గురయ్యారు. బాంబు బెదిరింపు కుట్ర గురించి హిరన్‌కు తెలుసునని ప్రాసిక్యూషన్ వాదించింది. ఆయన జీవించి ఉండి ఉంటే కుట్ర విఫలమై ఉండేదని వాదించింది.
ఆంటిలియా బెదిరింపు కేసు, మన్‌సుఖ్ హిరన్ హత్య కేసులలో తాను అప్రూవర్‌గా మారాలనుకుంటున్నానని, క్షమాభిక్ష కోరాలనుకుంటున్నానని ఈ లేఖలో సచిన్ వాజే తెలిపారు. ఆయన సహ నిందితుడు సునీల్ మానే ఇటీవల ఇదేవిధంగా అప్రూవర్‌గా మారుతానని, క్షమాభిక్ష ప్రసాదించాలని కోరిన సంగతి తెలిసిందే. సునీల్ మానే దరఖాస్తుపై సమాధానాన్ని దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం కోరింది.
ఇవి కూడా చదవండి :
Pakistan : హిందూ డాక్టర్‌ను చంపిన డ్రైవర్ అరెస్ట్
Rahul Gandhi : రాహుల్ గాంధీ అత్యంత ప్రమాదకారి : కేంద్ర మంత్రి
Updated Date - 2023-03-09T16:30:06+05:30 IST