Manipur : ప్రజలపై సైన్యాన్ని ప్రయోగించిన చరిత్ర కాంగ్రెస్‌ది.. మణిపూర్ సమస్యపై హిమంత బిశ్వ శర్మ..
ABN, First Publish Date - 2023-08-13T16:22:37+05:30
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
న్యూఢిల్లీ : తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు. మణిపూర్‌లో సైన్యాన్ని మోహరిస్తే, రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను శర్మ తీవ్రంగా తప్పుబట్టారు.
కాంగ్రెస్ పార్టీ శనివారం ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి చాలా ఇష్టమైన హిమంత బిశ్వ శర్మ భారత సైన్యాన్ని అవమానించారని ఆరోపించింది. సైన్యం ఏమీ చేయలేదని ఆయన అన్నారని తెలిపింది. మన సైన్యం శౌర్య, పరాక్రమాలను బీజేపీ నేతలు ప్రశ్నించడం ఇదే మొదటిసారి కాదని తెలిపింది. మోదీ కూడా 2013లో మన సైన్యం బలహీనమైనదని అన్నారని చెప్పింది. దేశ ద్రోహం వారి రక్తంలోనే ఉందని ఆరోపించింది.
ఈ ట్వీట్‌పై హిమంత ఆదివారం స్పందిస్తూ ఓ ట్వీట్ చేశారు. తాను మణిపూర్ సమస్య గురించి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో క్లిప్‌ను జత చేశారు. ఈ వీడియోలో కనిపిస్తున్నదాని ప్రకారం, ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు శర్మ సమాధానం చెప్పారు. మణిపూర్‌లో ‘నాన్సెన్స్’ను భారత సైన్యం రెండు రోజుల్లో ఆపగలదని, మోదీ మణిపూర్‌లో పర్యటించకపోవడానికి కారణాలు ఉన్నాయని, వాటిని తాను బహిరంగంగా చెప్పలేనని రాహుల్ గాంధీ అన్నారని, దీనిపై స్పందించాలని ఓ విలేకరి అడిగినపుడు శర్మ స్పందిస్తూ, అది తప్పు అని చెప్పారు. భారత వాయు సేన ఐజ్వాల్‌లో అదే పని చేసిందన్నారు. బాంబులను కురిపించడంతో హింస తగ్గుముఖం పట్టిందన్నారు. నేడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ, భారత సైన్యం హింసను ఆపాలని అంటున్నారని, దీని అర్థం ఏమిటంటే, సామాన్య ప్రజలపైన సైన్యం కాల్పులు జరపాలని రాహుల్ అంటున్నారని చెప్పారు. ఇదేనా ఆయన చేసే చికిత్స? ఆయన ఈ విధంగా ఎలా చెప్పగలరు? అని ప్రశ్నించారు. సైన్యం దేనినైనా పరిష్కరించజాలదని, ఓ నిర్దిష్ట పరిస్థితిలో కొంత వరకు శాంతిని తీసుకురాగలదని అన్నారు. కానీ పరిష్కారం మాత్రం మనసు నుంచి రావాలని, తూటాల ద్వారా కాదని చెప్పారు.
శర్మ ఆదివారం మరోసారి రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. అంతర్గత వివాదాలను పరిష్కరించడం సైన్యం ప్రధాన కర్తవ్యం కాదన్నారు. బయటి శక్తుల నుంచి వచ్చే ముప్పు నుంచి, ప్రచ్ఛన్న యుద్ధాల నుంచి మాతృభూమిని కాపాడటమే సైన్యం ప్రధాన బాధ్యత అని చెప్పారు. అంతర్గత సమస్యలకు పరిష్కారాలు అంతర్గతంగానే రావాలన్నారు. కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారాలు రావాలని చెప్పారు.
‘‘తోటి ప్రజలపై సైన్యాన్ని ఉపయోగించి, వారిపై తూటాలు కురిపించిన చరిత్ర మీ రాజ కుటుంబానికి ఉంది. అది 1966లో ఐజ్వాల్‌లో కావచ్చు లేదా 1984లో పవిత్రమైన అకల్ తఖ్త్‌లో కావచ్చు. వాటి వల్ల కలిగిన ఆవేదన, బాధ నేటి వరకు కొనసాగుతున్నాయి’’ అని రాహుల్ గాంధీని శర్మ దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి :
Ashwini Vaishnaw : టెక్నాలజీని ప్రజాస్వామికీకరణ చేయాలనేది మోదీ ఆకాంక్ష : అశ్విని వైష్ణవ్
Canada : ప్రముఖ హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేసిన ఖలిస్థానీలు
Updated Date - 2023-08-13T16:22:37+05:30 IST