Karnataka Polls ; పార్టీ మారిన నేతల ఆస్తుల్లో భారీ పెరుగుదల
ABN, First Publish Date - 2023-04-22T16:54:23+05:30
‘మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు’ అనే ఆరోపణలు మనం తరచూ వింటూ ఉంటాం. ఓటు వేయించుకోవడం కోసం ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఎర చూపించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉంటాయి.
బెంగళూరు : ‘మా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్నారు’ అనే ఆరోపణలు మనం తరచూ వింటూ ఉంటాం. ఓటు వేయించుకోవడం కోసం ఎమ్మెల్యేకు రూ.20 కోట్లు ఎర చూపించారనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తూ ఉంటాయి. వీటిలో నిజం ఎంతో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ, 2019లో కర్ణాటకలోని అధికార కూటమి నుంచి బీజేపీ (BJP)లో చేరిన ఎమ్మెల్యేల ఆస్తులు అప్పటికి, ఇప్పటికీ బాగా పెరిగినట్లు కనిపిస్తోంది.
గతంలో కాంగ్రెస్ (Congress), జేడీఎస్ (JDS) పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఎమ్మెల్యేలు మే 10న జరిగే శాసన సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరి ఎన్నికల అఫిడవిట్లలో వీరు తమ ఆస్తులను ప్రకటించారు. అంతకు ముందు ఎన్నికల అఫిడవిట్లలో వీరు ప్రకటించిన ఆస్తులతో పోల్చినపుడు వీరి తాజా ఆస్తులు బాగా పెరిగినట్లు వెల్లడవుతోంది. వీరిలో కొందరు బీజేపీ మంత్రివర్గంలో ముఖ్యమైన స్థానాలను కూడా చేజిక్కించుకోగలిగారు.
పార్టీ మారిన 11 మందిలో ఎక్కువ మంది ఆస్తులు పెరిగాయి. వీరిలో కొందరు స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెట్టారు. చాలా మంది తమ భార్య పేరు మీద ఆస్తులను కొన్నారు. కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కే సుధాకర్ చరాస్తులు 2018నాటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.1.11 కోట్లు కాగా, 2023నాటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ.2.79 కోట్లు. ఆయన స్థిరాస్తులు 2018లో రూ.52,81,000 కాగా, 2023లో రూ.1,66,60,480. సుధాకర్ సతీమణి చరాస్తుల విలువ 2018లో రూ.1,17,63,871 కాగా, 2023లో రూ.16,10,04,961కి పెరిగింది.
మహేశ్ కుమటహళ్లి చరాస్తుల విలువ 2018లో రూ.18,93,217 కాగా, 2023లో రూ.1,33,32,819కు పెరిగింది. అదేవిధంగా సహకార శాఖ మంత్రి ఎస్‌టీ సోమశేఖర్ చరాస్తుల విలువ 2018లో రూ.67.83 లక్షలు కాగా, 2023లో రూ.5.46 కోట్లకు పెరిగింది.
ఈ నాయకుల్లో చాలా మంది గతంలో తమ భార్యల ఆస్తుల వివరాలను వెల్లడించలేదు. వీరు శాసన సభ ఎన్నికల సందర్భంగా ఆ వివరాలను తెలిపారు. బీఏ బసవరాజు తన భార్యకు రూ.56.57 లక్షల విలువ చేసే చరాస్తులు ఉన్నాయని, రూ.21.57 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు ఉన్నాయని తెలిపారు.
వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ స్థిరాస్తుల విలువ 2018లో రూ.3.12 కోట్లు కాగా, 2023లో రూ.19.60 కోట్లకు పెరిగింది.
మంత్రి పదవులను నిర్వహిస్తుండటం వల్ల జీతాలు, ఇతర ప్రయోజనాలు లభిస్తున్నాయని, అందుకే తమ ఆస్తులు పెరిగాయని వీరు చెప్తున్నారు.
224 నియోజకవర్గాలుగల కర్ణాటక శాసన సభ ఎన్నికలు మే 10న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుంది.
ఇవి కూడా చదవండి :
Mamata Banerjee : ప్రాణ త్యాగానికైనా సిద్ధం.. ఈద్ సందర్భంగా మమత బెనర్జీ..
Eid prayers : ముస్లిం సోదరులకు మోదీ ఈద్ శుభాకాంక్షలు
Updated Date - 2023-04-22T17:10:33+05:30 IST