Ramnath Kovind: జమిలితో అన్ని పార్టీలకు మేలు జరుగుతుంది: రామ్‌నాథ్ కోవింద్
ABN , First Publish Date - 2023-11-21T15:49:56+05:30 IST
'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మద్దతు పలికారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఏ పార్టీకైనా దీనితో ప్రయోజనమేనని అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
రాయబరేలి: 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (One Nation, One Election)కు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) మద్దతు పలికారు. జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఏ పార్టీకైనా దీనితో ప్రయోజనమేనని అన్నారు. జమిలి ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీకి రామ్‌నాథ్ కోవింద్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో మంగళవారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏకకాలంలో ఎన్నికలకు (జమిలి) అన్ని గుర్తింపు పొందిన పార్టీలతోనూ తాను మాట్లాడామని, వారి సలహాలు, సూచనలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి రాజకీయ పార్టీ ఏదో ఒక సమయంలో జమిలి ఎన్నికలను మద్దతు తెలిపాయని అన్నారు.
జమిలి ఎన్నికలు దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని, ఇందుకు అన్ని పార్టీలు నిర్మాణాత్మకంగా మద్దతు తెలపాలని మాజీ రాష్ట్రపతి కోరారు. జమిలి ఎన్నికలతో డబ్బు ఆదా అవుతుందని, దానిని అభివృద్ధి పనులకు ఉపయోగించడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించే విషయాన్ని అధ్యయనం చేసి సాధ్యమైనంత త్వరగా సిఫారసులు అందజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం 8 మంది సభ్యులతో కూడిన అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ తొలి సమావేశాన్ని సెప్టెంబర్ 23న రామ్‌నాథ్ కోవింద్ నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, రాజ్యసభలో మాజీ విపక్ష నేత గులాం నబీ ఆడాద్, ఆర్ధిక కమిషన్ మాజీ చైర్మన్ ఎన్‌కే సింగ్, మాజీ లోక్‌సభ సెక్రటరీ జనరల్ సుభాష్ సి కస్యప్, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి, ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వే ఈ వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు.
కాగా, జమిలీ ఎన్నికలు 2024లో నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ వర్గాలు తెలిపాయి. 2029 లోక్‌సభ ఎన్నికలతో కలిపి అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించేందుకు ఒక ఫార్ములాను కమిషన్ రూపొందించే పనిలో ఉన్నట్టు చెబుతున్నారు. గతంలో 1951-52, 1957, 1962, 1967లో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించినప్పటికీ, 1968,1969లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, 1970 డిసెంబర్‌లో లోక్‌సభ రద్దవడంతో ఎన్నికలు వేర్వేరుగా నిర్వహించారు.