JP Nadda: అలాంటి వాళ్లకు ఇక్కడ చోటు లేదు... రాహుల్‌పై నడ్డా ఫైర్
ABN, First Publish Date - 2023-03-19T13:44:51+05:30
ప్రజాస్వామ్య హద్దులన్నింటినీ రాహుల్ గాంధీ అతిక్రమించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య హద్దులన్నింటినీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అతిక్రమించారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) అన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారికి ప్రజాస్వామ్యంలో చోటు లేదని వ్యాఖ్యానించారు. బీజేపీ యువజన విభాగమైన భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్వంలో చెన్నైలో ఆదివారంనాడు నిర్వహించిన 'నేషనల్ యూత్ పార్లమెంట్'ను ఉద్దేశించి నడ్డా ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా దివాళా తీసిందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇండియాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడం ద్వారా భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునేందుకు అమెరికా, యూరప్ వంటి విదేశీ శక్తులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. నిస్సిగ్గుగా రాహుల్ దేశాన్ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని, దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశాలను ఆహ్వానిస్తున్నారని అన్నారు.
దేశ రాజకీయ సంస్కృతిని ప్రధాన మంత్రి మోదీ సమూలంగా మార్చేశారని, భారత రాజకీయాల్లో మోదీ తీసుకు వచ్చిన మార్పులపై యువత దేశంలోని నలుమూలలకూ వెళ్లి ప్రజలకు తెలియజేయాలని నడ్డా కోరారు. దేశ వ్యాప్తంగా ఉన్న యువతను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలుసుకోవడం తనకు ఆనందంగా ఉందని, నేషనల్ యూత్ పార్లమెంట్ ఏర్పాటు చేసిన తేజస్వి సూర్య, భారతీయ జనతా యువమోర్చను అభినందిస్తున్నానని ఆయన అన్నారు. దేశానికి సంబంధించిన అంశాలపై యువత ప్రమేయాన్ని మరింత పెంచేందుకు యూత్ పార్లమెంట్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు.
బీజేపీ వ్యాఖ్యలను తోసిపుచ్చిన కాంగ్రెస్
బ్రిటన్‌లో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. పార్లమెంటులో రాహుల్ వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ అధికార పార్టీ సభ్యులు ఆయనను మాట్లాడనీయడం లేదని తెలిపింది. అదానీ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు రాహుల్ అంశాన్ని లేవనెత్తి సభా కార్యక్రమాలను బీజేపీ నేతలు ముందుకు సాగనీయకుండా చేస్తున్నారని ప్రత్యారోపణ చేసింది.
బ్రిటన్‌లో రాహుల్ గాంధీ భారత ప్రజాస్వామ్య మూలాలపై, దేశంలోని సంస్థలపై పూర్తి స్థాయి దాడులు జరుగుతున్నాయంటూ విమర్శించారు. దీంతో బీజేపీ ఆయనపై విమర్శల దాడికి దిగింది. విదేశీ గడ్డపై దేశ ప్రతిష్టను ఆయన దిగజారుస్తున్నారని ఆరోపించగా, దేశ అంతర్గత రాజకీయాలను మోదీ పదేపదే విదేశాల్లో అవమానించారంటూ ఆ ఆరోపణలను కాంగ్రెస్ తిప్పికొట్టింది.ం
Updated Date - 2023-03-19T14:35:09+05:30 IST