Parliament: పార్లమెంట్ సభ్యుల ఫోటో సెషన్‌లో అపశృతి.. స్పృహ కోల్పోయిన బీజేపీ ఎంపీ
ABN, First Publish Date - 2023-09-19T13:10:38+05:30
నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టడానికి ముందు ఎంపీలంతా పాత పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారంతా గ్రూపు ఫోటోలు దిగారు. మొదట లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా కలిసి ఫోటోలు పోజులిచ్చారు.
ఢిల్లీ: నూతన పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టడానికి ముందు ఎంపీలంతా పాత పార్లమెంట్ భవనంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారంతా గ్రూపు ఫోటోలు దిగారు. మొదట లోక్‌సభ, రాజ్యసభ సభ్యులంతా కలిసి ఫోటోలు పోజులిచ్చారు. తర్వాత లోక్‌సభ సభ్యులు, రాజ్యసభ్యులు విడివిడిగా గ్రూపు ఫోటోలు దిగారు. అయితే ఈ కార్యక్రమంలో చిన్నపాటి అపశృతి చోటు చేసుకుంది. బీజేపీ రాజ్యసభ ఎంపీ నరహరి అమీన్ స్పృహ కోల్పోయారు. 68 ఏళ్ల నరహరి అమీన్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో వెంటనే మిగతా సభ్యులంతా కలిపి ఆయనను పైకి లేపారు. మంచి నీళ్లు ఇచ్చారు. దీంతో 5 నిమిషాలపాటు ఆందోళనకర వాతావరణం నెలకొంది. అయితే ఆ తర్వాత నరహరి కోలుకున్నారు. దీంతో మళ్లీ తిరిగి ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. అయితే నరహరి స్పృహ కోల్పోయిన వీడియోను ఏఎన్‌ఐ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేసింది.
ఇక ఈ ఫోటో సెషన్‌లో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్‌డి దేవెగౌడ మొదటి వరుసలో కూర్చున్నారు. మరో ఫోటోలో ఉపరాష్ట్రపతి, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మధ్యలో ప్రధాని మోదీ కూర్చుకున్నారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర కేబినెట్ మంత్రులు, లోక్‌సభలో ఎనిమిది లేదా అంతకంటే ఎక్కువ మంది, రాజ్యసభలో ఐదు అంతకంటే లేదా అంతకంటే ఎక్కువ మంది సభ్యుల బలం కలిగిన పార్టీల నాయకులు, సీనియర్ సభ్యులు, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటరీ జనరల్ ముందు వరుసలో కూర్చున్నారు. పాత భవనంలోని సెంట్రల్ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమం తర్వాత, కొత్త భవనానికి ప్రొసీడింగ్స్ మారుతాయి. కాగా పార్లమెంట్ నూతన భవనంలో నేడు లోక్‌సభ మధ్యాహ్నం 1.15 గంటలకు ప్రారంభం కానుండగా.. రాజ్యసభ మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రారంభంకానుంది.
Updated Date - 2023-09-19T13:11:05+05:30 IST