Bharat Jodo Yatra : రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొంటానంటున్న బీజేపీ నేత
ABN, First Publish Date - 2023-01-04T15:06:01+05:30
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనాలని
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో పాల్గొనాలని ఆ పార్టీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ (Acharya Pramod Krishnam) ఇచ్చిన పిలుపుపై బీజేపీ నేత షెహజాద్ పూనావాలా (Shehzad Poonawalla) బుధవారం స్పందించారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకునే టుకడే-టుకడే గ్యాంగ్, ఆవులను వధించేవారు, శ్రీరాముడి జననం, ఉనికిలను ప్రశ్నించేవారు ఈ యాత్రలో పాల్గొనకపోతే, తాను పాల్గొంటానని చెప్పారు.
షెహజాద్ పూనావాలా అంతకుముందు ఆచార్య ప్రమోద్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రమోద్ స్పందిస్తూ, భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించారు. దీనిపై పూనావాలా స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశాన్ని ముక్కలు చేయాలనుకునేవారు, పార్లమెంటుపై దాడి చేసిన అఫ్జల్ గురుకు మద్దతిచ్చేవారు, హిందుత్వాన్ని ఐసిస్ ఉగ్రవాద సంస్థతో పోల్చేవారు, ఆవులను చంపేవారు, శ్రీరాముడి ఉనికి, జననాలను ప్రశ్నించేవారు, జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని అధికరణ 370ని పునరుద్ధరించాలని కోరేవారు ఈ యాత్రలో పాల్గొనకపోతే, తాను కచ్చితంగా పాల్గొంటానని చెప్పారు.
ఆచార్య ప్రమోద్ ఇచ్చిన ట్వీట్‌లో, ఈరోజు (బుధవారం) ఉదయం టీవీ చర్చలేవీ లేవా? అని పూనావాలాను అడిగారు. అందుకు పూనావాలా బదులిస్తూ, అందుకే మిమ్మల్ని ఓ కాంగ్రెస్ వాదిగా కాకుండా, ఓ భారతీయుడిగా పరిగణించి, సలహా ఇచ్చానన్నారు. శత్రువుల మూక లేకపోతే తాను యాత్రలో పాల్గొంటానన్నారు.
తమిళనాడులో సెప్టెంబరులో ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 30న జమ్మూ-కశ్మీరులో ముగుస్తుంది.
Updated Date - 2023-01-04T15:06:07+05:30 IST