Land For Jobs case: లాలూను ప్రశ్నిస్తున్న సీబీఐ
ABN, First Publish Date - 2023-03-07T13:22:17+05:30
'ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం' కేసులో సీబీఐ చేపట్టిన విచారణ రెండోరోజు కూడా ..
పాట్నా: 'ల్యాండ్ ఫర్ జాబ్స్ కుంభకోణం' (Land-for-jobs Scam) కేసులో సీబీఐ (CBI) చేపట్టిన విచారణ రెండోరోజు కూడా కొనసాగుతోంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి (Rabri Devi)ని పాట్నాలోని ఆమె నివాసంలో సోమవారంనాడు ప్రశ్నించిన సీబీఐ టీమ్..ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మాజీ కేంద్ర రైల్వే మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu prasad Yadav)ను మంగళవారం ప్రశ్నిస్తోంది. తన కుమార్తె మిసా భారతి నివాసంలో ఉంటున్న లాలూ ప్రసాద్ ఇంటికి సీబీఐ బృందం ఉదయమే చేరుకుంది. లాలూ దంపతులతో పాటు కుమార్తెలు మిసా, హేమ తదితరుల పేర్లను కూడా ఈ కేసులో సీబీఐ చేర్చింది. 2004 నుంచి 2009 వరకూ రైల్వే మంత్రిగా లాలూ ఉన్న సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అతి చవకగా భూములు కొనుగోలు చేసి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు.
లాలూ, రబ్రీదేవి, వారి కుమార్తెలు సహా 12 మందిపై 2022 మేలో ఎఫ్ఐఆర్ను సీబీఐ నమోదు చేసింది. ఇదే కేసులో గత ఏడాది జూలైలో లాలూ సహాయకుడు, మాజీ ఓఎస్డీ భోలా యాదవ్‌లను సీబీఐ అరెస్టు చేసింది. ఆసక్తికరంగా, రాజకీయ దురుద్దేశాలతో బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందంటూ ఎనిమిది విపక్ష పార్టీలకు చెందిన తొమ్మిది మంది నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన రెండు రోజుల్లోనే రబ్రీదేవిని సీబీఐ విచారించడం విశేషం. ప్రధానికి రాసిన లేఖలో సంతకం చేసిన ప్రముఖుల్లో లాలూ తనయుడు, బీహార్ ఉప ముఖ్యమంంత్రి తేజస్వి యాదవ్ కూడా ఉన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూతో సహా, పలువురు విపక్ష నేతలను కేంద్ర దర్యాప్తు సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్టు ఆ లేఖలో విపక్ష నేతలు ప్రస్తావించడం విశేషం. కేంద్రం ఆదేశాలతోనే దర్యాప్తు సంస్థలు విపక్ష నేతలను టార్గెట్ చేసుకున్నాయనే అనుమానాలకు పలు సంఘటనలతో బలం చేకూరుతోందని విపక్ష నేతలు ఆరోపించారు.
బీజేపీ వెర్సస్ ఆర్జేడీ
కాగా, దర్యాప్తు సంస్థలను కేంద్రం ఉసిగొలుపుతోందనే విపక్షాల ఆరోపణలను బీజేపీ నేతలు తోసిపుచ్చారు. సీబీఐ స్వతంత్ర సంస్థ అని, తన పని తాను చేసుకుపోతోందని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. ఎవరు చేసిన పనికి వారే కర్తలవుతారని లాలూ కేసుపై వారు వ్యాఖ్యానించారు. అయితే, ఈ ఆరోపణలను ఆర్జేడీ నేతలు తోసిపుచ్చారు. రాజకీయ ఉద్దేశాలతోనే ఈ దాడులు జరుపుతున్నారంటూ విమర్శించారు. రబ్రీదేవి సైతం గత వారం మాట్లాడుతూ, లాలూను చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. ''మేము ఎక్కడికీ పారిపోవడం లేదు. 30 ఏళ్లుగా మేము ఆరోపణలను ఎదుర్కొంటూనే ఉన్నాం. బీహార్‌లో లాలూను చూసి బీజేపీకి భయం పట్టుకుంది'' అని రబ్రీ వ్యాఖ్యానించారు.
ఐఆర్సీటీసీ కుంభకోణం ఏమిటంటే..?
లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు బీహార్‌లోని అభ్యర్థుల నుంచి వ్యవసాయ భూములను తీసుకుని వారికి రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పించారనే ఆరోపణలున్నాయి. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే, ఆ ఆరోపణలను నిరూపించే సరైన సాక్ష్యాలు లేనందున యాదవ్‌పైన, ఆయన కుటుంబ సభ్యులపైన ఉన్న కేసును 2021లో సీబీఐ మూసివేసింది. గత ఏడాది డిసెంబర్లో సీబీఐ లాలూపై అవినీతి కేసులను తిరిగి ఓపెన్ చేసింది. భూములు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారంటూ ఛార్జిషీటులో సీబీఐ పేర్కొంది. 74 ఏళ్ల లాలూ యూపీఏ-1 ప్రభుత్వంలో రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు పలు కీలక ప్రాజెక్టులను కమర్షియల్ రియల్ ఎస్టేట్ డవలపర్.. ఢిల్లీ ల్యాండ్ అండ్ ఫైనాన్స్ (డీఎల్ఎఫ్)కు జారీ చేశారని, ఇందుకు ప్రతిగా డీఎల్ఎఫ్ గ్రూప్ కోట్లాది రూపాయల ఆస్తులు లాలూకు కట్టబెట్టిందని సీబీఐ ఆరోపణ. ముంబైలోని బాంద్ర, న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ రీడవపల్మెంట్ వంటి ల్యాండ్ లీజ్ ప్రాజెక్టులు సహా పలు రైల్వే ప్రాజెక్టులను డీఎల్ఎఫ్ గ్రూప్‌కు లాలూ ఇచ్చినందుకు ప్రతిగా దక్షిణ ఢిల్లీలో కోట్లాది రూపాయల ఆస్తిని డీఎల్ఎఫ్ గ్రూప్ నుంచి లాలూ పొందినట్టు సీబీఐ అభియోగం.
తేజస్వి పాత్ర ఏమిటి?
2018లో సీబీఐ అభియోగాల ప్రకారం, డీఎల్ఎఫ్ షెల్ కంపెనీ రూ.5 కోట్లతో ఓ ప్రాపర్టీ కొనుగోలు చేసింది. మార్కెట్ రేటు రూ.30 లక్షల రూపాయల కంటే చాలా తక్కువకు ఈ ఆస్తి కొనుగోలు చేశారు. ఆ తర్వాత, లాలూ తనయుడు తేజస్వి యాదవ్ ఆ షెల్ కంపెనీని కేవలం రూ.4 కోట్లతో షేర్ల బదిలీ ద్వారా కొనుగోలు చేశారు. ప్రస్తుతం తేజస్వి యాదవ్ బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.
Updated Date - 2023-03-07T13:22:17+05:30 IST