Chennai: అంధకారంలో ఉత్తర చెన్నై.. శివారు ప్రాంతాలు కూడా..
ABN, First Publish Date - 2023-12-07T07:35:19+05:30
మిచౌంగ్ తుఫాను తీరం దాటి 36 గంటలు గడిచినా ఉత్తర చెన్నై(North Chennai), శివారు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు విద్యుత్
- ఈబీ కార్యాలయం ముట్టడి
- ధర్నా చేసిన బాధితులు
- మంత్రులకు తప్పని నిరసన సెగ
పెరంబూర్(చెన్నై): మిచౌంగ్ తుఫాను తీరం దాటి 36 గంటలు గడిచినా ఉత్తర చెన్నై(North Chennai), శివారు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా లేక అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో తమ ప్రాంతాల్లోని నీరు తగ్గినా విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని బాధిత ప్రాంతాల ప్రజలు రాత్రి వేళ విద్యుత్ కార్యాలయాలు, రోడ్లపై బైఠాయిస్తున్నారు. గత ఆదివారం సాయంత్రం నుంచి తుఫాను ముందస్తు చర్యల్లో భాగంగా నగరం, శివారు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో ఇళ్లలో నీరు చేరడంతో రెండు రోజులుగా ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు రోడ్లు, వీధుల్లో చేరిన నీరు తొలగిస్తున్నారు. ఆక్రమంలో, అన్నానగర్, టి.నగర్, కోడంబాక్కం, అడయార్ సహా పలు ప్రాంతాల్లో నీరు తొలగించి క్రమంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. కానీ, బుధవారం వరకు ఉత్తర చెన్నై పరిధిలోని వాషర్‌మెన్‌పేట, ఎంకేబీ నగర్, సత్యమూర్తినగర్, వ్యాసర్పాడి, కన్నదాసన్ నగర్, శివారు ప్రాంతాలైన మేడవాక్కం, ముడిచ్చూర్, ఆవడి, అంబత్తూర్ సహా పలు ప్రాంతాల్లో మోకాలు లోతులో నీరుండడంతో సరఫరా పునరుద్ధరించలేదు. దీంతో ఆవేశం చెందిన ప్రజలు ఆవడి, అంబత్తూర్ ప్రాంతాల్లో విద్యుత్ కార్యాలయాలను ముట్టడించారు. తిరువొత్తియూర్, పెరంబూర్, ఓఎంఆర్ రోడ్డు తదితర ప్రాంతాల్లో రాస్తారోకో చేపట్టారు. పిల్లలు, వృద్ధులు అంధకారంలో మగ్గుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడంలేదంటూ వారు మండిపడ్డారు.
60 శాతం మేర విద్యుత్ పునరుద్ధరణ...
వీధుల్లో చేరిన నీటిని తొలగించిన అధికారులు మంగళవారం ఉదయం నుంచి క్రమక్రమంగా విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అయినా కొన్ని ప్రాంతాల్లో 3 అడుగులకు పైగా నీరు నిల్వ ఉండడంతో ఆ ప్రాంతాల్లో ఇంకా విద్యుత్ సరఫరా అందించలేదు. ఈ విషయమై ఈబీ అధికారులు మాట్లాడుతూ... వరద బాధిత ప్రాంతాల్లో నీటిని తొలగించిన తరువాతే విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నామన్నారు. పులియాంతోపు, ఓటేరి, మడిపాక్కం, నంగనల్లూర్, అరుంబాక్కం, ఎస్‌ఎ్‌సకే నగర్, ఎంఎం కాలని, ఆదంబాక్కం, ఏజీఎస్ కాలనీ, అంబేడ్కర్ నగర్, ఈబీ కాలనీ, ఆవడిలోని పలు ప్రాంతాలు, తిరువాన్మియూర్, కొడుంగైయూర్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదని తెలిపారు. ఆ ప్రాంతాల్లో నీటిని తొలగించిన వెంటనే విద్యుత్ అందిస్తామని, ప్రస్తుతం నగరంలో 60శాతం మేర విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.
మంత్రులకు నిరసన సెగ...: వరద ప్రాంతాలను పరిశీలించేందకు వెళ్లిన మంత్రులకు ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి. తమ ప్రాంతాల్లో నీరు తొలగించలేదని, విద్యుత్ సరఫరా పునురుద్ధరించలేదంటూ తండయార్‌పేట మండల కార్యాలయం ఎదుట బుధవారం ప్రజలు ఆందోళన చేపట్టారు. వారితో మాట్లాడేందుకు వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబును ప్రజలు చుట్టుముట్టారు. ఆయనతో వాగ్వాదానికి దిగారు. అలాగే, పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులకు స్థానిక ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2023-12-07T07:35:21+05:30 IST