Modi Vs Rahul Gandhi : భారత్ భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంది.. మోదీ అబద్ధాలు చెప్తున్నారు.. : రాహుల్ గాంధీ
ABN, First Publish Date - 2023-08-30T10:55:27+05:30
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ చెప్తున్నారని, అవన్నీ అవాస్తవాలని పునరుద్ఘాటించారు.
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi) మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)పై విరుచుకుపడ్డారు. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకోలేదని మోదీ చెప్తున్నారని, అవన్నీ అవాస్తవాలని పునరుద్ఘాటించారు. ఈ విషయం లడఖ్ ప్రజలకు బాగా తెలుసునని, తాను చాలా కాలం నుంచి చెప్తూనే ఉన్నానని తెలిపారు. చైనా తాజాగా విడుదల చేసిన మ్యాపులో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్ చిన్ తమ దేశంలో అంతర్భాగమని పేర్కొన్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా స్టాండర్డ్ మ్యాపు 2023 ఎడిషన్‌ను అధికారికంగా సోమవారం విడుదల చేసింది. దీనిలో భారత దేశానికి చెందిన అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతం కూడా ఉన్నాయి. 1962లో యుద్ధం సమయంలో అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనా ఆక్రమించుకుంది. ఈ మ్యాపులో తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాపుపై భారత దేశం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ (Subrahmanian Jaishankar) స్పందిస్తూ, చైనాకు ఇది పాత అలవాటేనని, ఇలాంటి అర్థరహిత, విడ్డూరమైన మాటలు చెప్తూనే ఉంటుందని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీ కర్ణాటకలోని మైసూరు వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ, లడఖ్‌లో కనీసం ఒక అంగుళం భూమినైనా చైనా ఆక్రమించుకోలేదని ప్రధాని మోదీ చెప్తున్న మాటలు అబద్ధాలని తాను అనేక సంవత్సరాలుగా చెప్తున్నానని తెలిపారు. సరిహద్దులను దాటి చైనా మన దేశంలోకి వచ్చిందని లడఖ్ ప్రజలందరికీ తెలుసునన్నారు. ఈ మ్యాపు సమస్య చాలా తీవ్రమైనదన్నారు. వాళ్లు భూమిని లాక్కున్నారన్నారు. ప్రధాన మంత్రి దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఆగస్టు 22 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న మోదీ, జీ జిన్‌పింగ్ కాసేపు మాట్లాడుకున్న సంగతి తెలిసిందే. వాస్తవాధీన రేఖ వెంబడి దళాల ఉపసంహరణ, ఉద్రిక్తతల సడలింపు వంటివాటి కోసం కృషిని పెంచాలని ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. అయినప్పటికీ చైనా ఈ విధంగా రెచ్చగొట్టే చర్యకు పాల్పడింది.
మరోవైపు సెప్టెంబరు 8 నుంచి 10 వరకు న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరుగుతుంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా హాజరవుతారు.
రాహుల్ గాంధీ ఇటీవల లడఖ్‌లో పర్యటించారు. అధికరణ 370 రద్దు తర్వాత ఆయన ఇక్కడ పర్యటించడం ఇదే మొదటిసారి.
ఇవి కూడా చదవండి :
BJP : యోగి ఆదిత్యనాథ్‌పై వరుణ్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు
LPG Prices: ఎల్‌పీజీ ధర రూ.200 తగ్గింపు..
Updated Date - 2023-08-30T10:55:27+05:30 IST