Caste survey: బీహార్ తరహాలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులాల సర్వే.. సీఎం కీలక ప్రకటన
ABN, First Publish Date - 2023-10-07T17:24:49+05:30
వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్లో కులాలవారీ సర్వే జరిపించే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది. బీహార్ తరహాలోనే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులగణన జరుపుతామని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రకటించారు.
రాయపూర్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు కీలకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ (Congress) పార్టీ ఆయా రాష్ట్రాల్లో బీహార్ తరహాలో కులాలవారీ సర్వే (Caste survey) జరిపించే అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది. ఈ మేరకు హామీలు గుప్పిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా సైతం కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కులగణన జరిపిస్తామని హామీ ఇచ్చారు.
''కులగణన వ్యవస్థను తీసుకుస్తామని రాయపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా ఇక్కడ కూడా (ఛత్తీస్‌గఢ్) కులగణన జరిపిస్తాం. జనాభా ఆధారంగా వ్యక్తుల పార్టిసిపేషన్ ఉండాలని మేము భావిస్తున్నాం. బీహార్ తరహాలోనే కుల ఆధారిత జనగణన నిర్వహణకు ఆదేశాలు ఇస్తాం'' అని గెహ్లాట్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్‌లో గెహ్లాట్‌తో కలిసి పాల్గొన్న ర్యాలీలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి తిరిగి అధికారం ఇస్తే రాష్ట్రంలో కులగణన చేపడతామని ప్రకటించారు.
కాగా, జాతీయ కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ ఇప్పటికే డిమాండ్ చేశారు. ''గ్రేటర్ ద పాపులేషన్, గ్రేటర్ ది రైట్స్''అంటూ రాహుల్ నినాదం ఇచ్చారు. మరోవైపు, అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సైతం రాష్ట్రంలోని స్వదేశీ ముస్లి సబ్-గ్రూపుల ప్రయోజనాల కోసం సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించనున్నట్టు ప్రకటించారు.
ఇది విభజనేనంటున్న బీజేపీ
కాగా, కుల ప్రాతిపదికపై హిందువులను విభజించేందుకే విపక్ష పార్టీలు కులగణన డిమాండ్ చేస్తున్నాయంటూ బీజేపీ తిప్పికొట్టింది. కులాల ఆధారంగా బీజేపీ ఓటు బ్యాంకును కొల్లగొట్టే ఎత్తుగడగా బీజేపీ చెబుతోంది.
Updated Date - 2023-10-07T17:24:49+05:30 IST