Rahul Gandhi : ‘మోదీ ఇంటిపేరు’కేసులో హైకోర్టు తీర్పు.. కాంగ్రెస్ ఆగ్రహం, స్వాగతించిన బీజేపీ..
ABN, First Publish Date - 2023-07-07T12:39:37+05:30
‘మోదీ ఇంటిపేరు’ (Modi surname) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) రివ్యూ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూఢిల్లీ : ‘మోదీ ఇంటిపేరు’ (Modi surname) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress leader Rahul Gandhi) రివ్యూ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడాన్ని బీజేపీ స్వాగతించగా, కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సత్యమే గెలుస్తుందని బీజేపీ వ్యాఖ్యానించగా, కాంగ్రెస్ స్పందిస్తూ, మోసం, ప్రజాధనం దుర్వినియోగాలను బయటపెట్టినందుకు రాహుల్‌ను శిక్షిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో బహిరంగ సభలో మాట్లాడుతూ, దొంగలందరి ఇంటి పేరు మోదీ ఎలా అవుతోంది? అని రాహుల్ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గుజరాత్‌కు చెందిన పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఆయన దోషి అని కోర్టు 2023 మార్చి 23న తీర్పు చెప్పింది, ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దోషిగా నిర్థరణ అయిన వ్యక్తి చట్టసభల సభ్యునిగా కొనసాగడానికి చట్టం అంగీకరించదు కాబట్టి ఆయన వయనాద్ లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడని లోక్‌సభ సచివాలయం మార్చి 24న ప్రకటించింది. ఈ కోర్టు తీర్పు అమలును నిలుపుదల చేయాలని కోరుతూ రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు ఏప్రిల్ 20న తిరస్కరించింది. దీంతో ఆయన ఏప్రిల్ 25న గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీపై ప్రస్తుత కేసు మాత్రమే కాకుండా మరికొన్ని ఇతర కేసులు కూడా దాఖలయ్యాయని తెలిపింది. వీర్ సావర్కర్ మనుమడు దాఖలు చేసిన కేసు అటువంటి వాటిలో ఒకటి అని గుర్తు చేసింది. ఆయనపై ఎనిమిది క్రిమినల్ పరువు నష్టం కేసులు నమోదై, విచారణలో ఉన్నాయని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ, ఆయనను దోషిగా నిర్థరిస్తూ క్రింది కోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగానూ అన్యాయమైనది కాదని, ఈ తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని స్పష్టం చేసింది. గాంధీ అపీలును దానిలోని యోగ్యతల ఆధారంగా సాధ్యమైనంత త్వరగా విచారించి, తీర్పు చెప్పాలని సెషన్స్ కోర్టును ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో రాహుల్ గాంధీపై లోక్‌సభ సభ్యత్వానికి అనర్హత కొనసాగుతుంది. ఆయన ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉండదు.
బీజేపీ స్పందన
గుజరాత్ హైకోర్టు తీర్పున బీజేపీ స్వాగతించింది. ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఇచ్చిన ట్వీట్‌లో ‘సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ పిటిషన్‌ను గతంలో సూరత్ సెషన్స్ కోర్టు తోసిపుచ్చిందని, ఇప్పుడు గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చిందని చెప్పారు. తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసిందన్నారు. రాహుల్ గాంధీ వరుసగా నేరాలు చేసే వ్యక్తి అని, ఓబీసీ సమాజానికి క్షమాపణ చెప్పడానికి బదులు, కాంగ్రెస్ నిస్సిగ్గుగా ప్రవర్తిస్తోందని దుయ్యబట్టారు.
మోసాన్ని బయటపెట్టినందుకు శిక్ష : కాంగ్రెస్
కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జీవాలా ఇచ్చిన ట్వీట్‌లో, వంచన, మోసం, ప్రజాధనం దుర్వినియోగాలను బయటపెట్టినందుకు రాహుల్ గాంధీని శిక్షిస్తున్నారని ఆరోపించారు. బ్యాంకులను మోసగించిన నీరవ్ మోదీ, అమిత్ మోదీ, నీషల్ మోదీ, మెహుల్ చోక్సీ వంటివారిని శిక్షించడానికి బదులు ప్రజాధనం దుర్వినియోగమవుతుండటాన్ని, మోసాలను బయటపెట్టిన ‘మెసెంజర్’ను శిక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ సత్యం, ధర్మం, నిర్భయత్వం మార్గాన్ని ఎంచుకున్నారని, అధికార కంచుకోటల్లో ఉన్నవారి నుంచి జవాబుదారీతనాన్ని కోరుతున్నారని చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తాము సత్యం, ధర్మం మార్గంలోనే ముందుకెళ్తామని చెప్పారు. సత్యమేవ జయతే అని నినదించారు.
ఇవి కూడా చదవండి :
Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర తాత్కాలిక నిలుపుదల
2024 Lok Sabha Elections : మోదీ సంచలన నిర్ణయం.. తమిళనాడు నుంచి పోటీ?..
Updated Date - 2023-07-07T12:47:07+05:30 IST