Mukhtar Ansari : ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష
ABN, First Publish Date - 2023-04-29T16:06:47+05:30
గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం తీర్పు చెప్పింది.
ఘాజీపూర్ (ఉత్తర ప్రదేశ్) : గ్యాంగ్‌స్టర్, మాజీ ఎమ్మెల్యే ముక్తార్ అన్సారీ (Mukhtar Ansari)కి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు శనివారం తీర్పు చెప్పింది. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్‌ని అపహరించి, హత్య చేసినట్లు రుజువుకావడంతో ఆయనకు ఈ శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.5 లక్షలు జరిమానా చెల్లించాలని కూడా ఆదేశించింది. కిడ్నాపింగ్, హత్య కేసుల్లో ముక్తార్ అన్సారీతోపాటు ఆయన సోదరుడు, బీఎస్‌పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా దోషులని కోర్టు తీర్పు చెప్పింది.
ముక్తార్ అన్సారీ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనేక కేసుల్లో దోషి అని కోర్టులు తీర్పులు చెప్పాయి. 1996లో విశ్వహిందూ పరిషత్ (Vishwa Hindu Parishad-VHP) నేత నందకిశోర్ రుంగ్టాను అపహరించిన కేసులోనూ, 2005లో అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద రాయ్ హత్య కేసులోనూ ముక్తార్ దోషి అని కోర్టు తీర్పు చెప్పింది. 2001లో ఉస్రి ఛట్టి గ్యాంగ్ వార్ సంఘటనలో హత్య కేసు కూడా ఈ ఏడాది జనవరిలో ముక్తార్ అన్సారీపై నమోదైంది. భారత శిక్షా స్మృతి (IPC) సెక్షన్లు 302, 147, 148, 149 ప్రకారం ఘాజీపూర్‌లోని మహమ్మదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది.
హత్య, హత్యాయత్నాలకు సంబంధించిన ఐదు కేసుల్లో ముక్తార్ అన్సారీకి, ఆయన సహాయకుడు భీమ్ సింగ్‌కు పదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ ఘాజీపూర్ కోర్టు గత ఏడాది డిసెంబరులో తీర్పు చెప్పింది. కానిస్టేబుల్ రఘువంశ్ సింగ్ హత్య, ఘాజీపూర్ అదనపు ఎస్పీపై దాడి కేసులు కూడా వీటిలో ఉన్నాయి. 2003లో పిస్తోలుతో లక్నో జిల్లా జైలు జైలర్ ఎస్‌కే అవస్థిని బెదిరించిన కేసులో ముక్తార్ దోషి అని అలహాబాద్ హైకోర్టు లక్నో ధర్మాసనం తీర్పు చెప్పింది.
కృష్ణానంద్ రాయ్ కేసులో బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీ కూడా నిందితుడే. ఆయనపై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. అంతకుముందు కృష్ణానంద్ రాయ్ సతీమణి అల్కా రాయ్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లో మాఫియా రాజ్యానికి కాలం చెల్లిందని చెప్పారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు.
ఇవి కూడా చదవండి :
Karnataka Elections: నాకు లెక్కలు బాగా తెలుసు..141 సీట్లు గెలుస్తాం : డీకే
Kejriwal Bungalow Row: ఫైళ్లు పంపమని ఆదేశించిన ఎల్జీ
Updated Date - 2023-04-29T16:11:28+05:30 IST