Excise Policy Scam: సిసోడియాకు తాత్కాలిక బెయిల్ పిటిషన్‌పై సీబీఐకి హైకోర్టు నోటీసు
ABN, First Publish Date - 2023-05-03T16:14:13+05:30
అస్వస్థతతో తన భార్య ఆసుపత్రిలో ఉన్నందున తనకు తాత్కాలిక బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి..
న్యూఢిల్లీ: అస్వస్థతతో తన భార్య ఆసుపత్రిలో ఉన్నందున తనకు తాత్కాలిక బెయిల్ (Interm Bail) మంజూరు చేయాలంటూ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ (CBI)కి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) బుధవారంనాడు నోటీసులు పంపింది. ఎక్సైజ్ పాలసీ కుంభకోణం (Excise policy Scam)లో మార్చి 26న సిసోడియాను సీబీఐ అరెస్టు చేయగా, ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.
కాగా, సిసిడోయా భార్య గత వారం ఆరోగ్యం విషమించడంతో ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. సిసోడియా దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్‌పై ఇప్పటికే విచారణ జరుపుతున్న హైకోర్టు దీనిపై గురువారంనాడు వాదనలు వింటామని తెలిపింది. కాగా, బుధవారంనాడు కోర్టుకు హాజరైన సిసోడియా తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ అగర్వాల్ తన వాదనలు వినిపించారు. సిసోడియా భార్య మల్టిపుల్ స్క్లిరోసిస్ (Multiple Sclerosis)తో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రిపాలయ్యారని జస్టిస్ దినేష్ కుమార్ శర్మకు తెలియజేశారు. దీనికి ముందు, సిసోడియా దాఖలు చేసుకున్న బెయిల్ దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. మనీష్ సిసోడియాపై ఆరోపణల తీవ్రత, కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్న దశలో ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ పేర్కొన్నారు. కేసులో సిసోడియా పాత్రపై విచారణ ఇంకా పూర్తికాలేదని, సహనిందుతులపై పాత్రపై కూడా విచారణ జరుగుతోందని న్యాయమూర్తి అన్నారు. అప్లికెంట్ భార్య ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలనుకున్నా, ఇరవై ఏళ్లుగా ఆమె న్యూరాలజికల్ సమస్యతో బాధపడుతున్నారని, అయితే ఆన్ రికార్డుగా దాఖలు చేసిన డాక్యుమెంట్లు 2022-2023కు సంబంధించినవిగా ఉన్నాయని విచారణ కోర్టు పేర్కొంది.
Updated Date - 2023-05-03T16:14:13+05:30 IST