Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
ABN, First Publish Date - 2023-06-11T09:24:58+05:30
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు కోరారు.
న్యూఢిల్లీ : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు ఇవ్వాలని ఇద్దరు మహిళా రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు (Delhi Police) కోరారు. ఆయన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిపే ఆడియోలు, వీడియోలు, ఫొటోలు, సాక్షుల వివరాలను తెలియజేయాలని కోరారు. బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించినట్లు ఆరోపిస్తూ రెజ్లర్లు నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఆయనపై జూన్ 15నాటికి ఛార్జిషీటు దాఖలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో వీరు తాత్కాలికంగా తమ నిరసనను నిలిపివేశారు.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఇద్దరు మహిళా రెజ్లర్లు ఏప్రిల్ 21న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తమ శ్వాసను తనిఖీ చేసే నెపంతో తమ వక్షోజాలను, పొట్టను ఆయన ముట్టుకున్నారని ఆరోపించారు. తమతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. పోలీసులు స్పందిస్తూ ఈ ఆరోపణలకు తగిన ఆధారాలను సమర్పించాలని ఇద్దరు మహిళా రెజ్లర్లకు సీఆర్‌పీసీ సెక్షన్ 91 ప్రకారం జూన్ 5న వేర్వేరుగా నోటీసులు జారీ చేశారు. ఈ ఆరోపణలను రుజువు చేసే ఆడియోలు, వీడియోలు, మెసేజ్‌లు, సాక్షుల వివరాలను తెలియజేయాలని కోరారు. వీటిని సమర్పించేందుకు ఒక రోజు గడువు ఇచ్చారు.
ఈ నోటీసులు అందుకున్న ఇద్దరిలో ఒక రెజ్లర్ మాట్లాడుతూ, బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా తమ వద్దనున్న సాక్ష్యాధారాలను పోలీసులకు సమర్పించామని చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలనుబట్టి తెలుస్తోంది. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడిన తేదీలు, సమయాలు, అందుకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు, వాట్సాప్ మెసేజ్‌లు, సాక్షుల వివరాలను సమర్పించాలని ఈ ఇద్దరు మహిళా రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు కోరారు. డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయానికి ఎప్పుడు వెళ్లారు? రూమ్‌మేట్స్ వివరాలు, సంఘటనలు జరిగిన సమయాల్లో విదేశాల్లో ఉన్నారా? వీరిలో ఓ రెజ్లర్ డబ్ల్యూఎఫ్ఐ కార్యాలయానికి వెళ్లినపుడు ఏ హోటల్‌లో బస చేశారో చెప్పాలని కూడా కోరారు.
ఢిల్లీ పోలీసులు ఓ రెజ్లర్‌కు, ఆమె బంధువుకు వేర్వేరుగా నోటీసులు ఇచ్చారు. సింగ్‌పైన ఫిర్యాదు చేసిన తర్వాత వచ్చిన బెదిరింపు ఫోన్ కాల్స్ సమాచారాన్ని ఇవ్వాలని వీరిని కోరారు. దీనికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగులను, వాట్సాప్ సందేశాలను సమర్పించాలని కోరారు.
బాధితులపై ఒత్తిళ్లు : రెజ్లర్లు
లైంగిక వేధింపులకు గురైన రెజ్లర్లపై ఒత్తిడి తెచ్చేందుకు బ్రిజ్ భూషణ్ తన పలుకుబడిని ఉపయోగిస్తున్నారని రెజ్లర్లు ఆరోపించారు. తమ స్టేట్‌మెంట్లను మార్చాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు. జూన్ 15 నాటికి ఆయనపై కఠిన చర్యలు తీసుకోకపోతే తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
Chief Minister: సీఎం సంచలన వ్యాఖ్యలు.. ఆ రాష్ట్రం సహా 40 చోట్ల గెలుపు మాదే..
సీఎంఎస్ సెక్యూరిటీస్‌లో రూ.7 కోట్ల దోపిడీ
Updated Date - 2023-06-11T09:25:46+05:30 IST