Maharashtra : ఉద్ధవ్ థాకరే వ్యాఖ్యలపై దేవేంద్ర ఫడ్నవీస్ వ్యంగ్యాస్త్రాలు
ABN, First Publish Date - 2023-05-11T15:58:32+05:30
మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీ (MVA) ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠించేందుకు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా ఉందని
ముంబై : మహారాష్ట్రలో మహా వికాస్ అగాడీ (MVA) ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠించేందుకు తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంతృప్తికరంగా ఉందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) చెప్పారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామిక ప్రక్రియ సాధించిన విజయమని తెలిపారు. శివసేన-బీజేపీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం చట్టబద్ధమైనదేనని, రాజ్యాంగబద్ధమైనదేనని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పిందన్నారు.
సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పు అటు షిండే, ఇటు థాకరే వర్గాలకు ఏదో ఓ విధంగా సంతోషకరంగా ఉంది. షిండే వర్గంలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం, ఎవరు నిజమైన శివసేన అనే అంశాన్ని శాసన సభ సభాపతి నిర్ణయిస్తారని చెప్పడం ఆ వర్గానికి సంతోషాన్నిచ్చింది. షిండే వర్గమే నిజమైన శివసేన పార్టీ అని ఎన్నికల కమిషన్ ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. శివసేన (Shiv Sena) ఎమ్మెల్యేలు షిండే వర్గంలోకి వెళ్ళడంతో బల పరీక్ష నిర్వహించాలని అప్పటి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోషియారీ ఆదేశించడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ ఆదేశం కారణంగానే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం కూలిపోయింది. శివసేన విప్‌గా భరత్ గొగవాలేను స్పీకర్ నియమించడం చట్టవిరుద్ధమని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ తీర్పు ప్రస్తుత షిండే ప్రభుత్వానికి చెంపపెట్టు అని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ, మహా వికాస్ అగాడీ కుట్ర ఓడిపోయిందని చెప్పారు. మహారాష్ట్రలో ఏర్పాటైన తమ ప్రభుత్వం సంపూర్ణంగా చట్టబద్ధమైనదేనని, దీనిపై ఇక ఎవరికీ సందేహాలు అవసరం లేదని చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఉద్ధవ్ థాకరే చేసిన డిమాండ్‌పై దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు ఉద్ధవ్ థాకరేకు లేదని చెప్పారు. శాసన సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి విజయం సాధించాయని, ప్రజాతీర్పును పక్కనబెట్టి, శివసేన కాంగ్రెస్‌తో చేతులు కలిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు. నైతిక విలువ గురించి మాట్లాడటం ఉద్ధవ్ థాకరేకు తగదని చెప్పారు. ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్‌సీపీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టు కట్టినపుడు నైతిక విలువల గురించి మర్చిపోయారా? అని ఉద్ధవ్ థాకరేను నిలదీశారు. ముఖ్యమంత్రి పదవికి ఉద్ధవ్ రాజీనామా చేయడానికి కారణం నైతిక విలువలు కాదని, తనతో ఉన్న ఎమ్మెల్యేలు కూడా తనను వదిలిపెడతారేమోననే భయం వల్లే ఆయన రాజీనామా చేశారని చెప్పారు.
ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఇది సత్యం సాధించిన విజయమని తెలిపారు. శివసేనలోని ఇరు వర్గాలు దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై శాసన సభ స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. షిండే నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధమైనదని, చట్టవిరుద్ధమైనదని ఉద్ధవ్ వర్గం ఆరోపిస్తోందని, మానసిక సంతృప్తి కోసమే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రచారాన్ని తునాతునకలు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. ఎమ్మెల్యేల మద్దతు లేదని తెలుసుకున్న తర్వాతే ఉద్ధవ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారన్నారు.
ఇవి కూడా చదవండి :
Uddhav Thackeray: సుప్రీంకోర్టులో ఉద్దవ్ ఠాక్రే వర్గానికి ఊరట
The Kerala Story:సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన కేరళ స్టోరీ టీమ్
Updated Date - 2023-05-11T15:58:32+05:30 IST