Sanjay Raut: మురికి రాజకీయాల వల్లే... సంజయ్ రౌత్ సంచలన ట్వీట్
ABN, First Publish Date - 2023-05-02T20:21:19+05:30
ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ప్రకటించడంపై శివసేన..
ముంబై: ఎన్‌సీపీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ (Sharad pawar) ప్రకటించడంపై శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తనదైన శైలిలో స్పందించారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే (Bal Tackeray) తీసుకున్న నిర్ణయాన్నే ఈరోజు పవార్ తీసుకున్నారని, చరిత్ర పునరావృతమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
''మురికి రాజకీయాలు, ఆరోపణలతో విసుగెత్తిపోయిన శివసేన సుప్రీం బాలాసాహెబ్ థాకరే కూడా అప్పట్లో శివసేన ప్రముఖ్ పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతమైనట్టు కనిపిస్తోంది. అప్పట్లో శివసైనికులకు తన పట్ల ఉన్న ప్రేమకు కరిగిపోయి తన నిర్ణయాన్ని బాలాసాహెబ్ వెనక్కి తీసుకున్నారు. పవార్ సైతం మహారాష్ట్ర రాజకీయాలకు ఆత్మవంటివారు'' అని సంజయ్ రౌత్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. సంజయ్ రౌత్ శివసేన (యూబీటీ) పార్టీ 'మహావికాస్ అఘాడి'లో భాగస్వామిగా ఉంది. ఈ కుటమిలో ఎన్‌సీపీ, కాంగ్రెస్ సైతం ఉన్నాయి.
పవార్ సంచలన ప్రకటన
పవార్ మంగళవారంనాడు అనూహ్యంగా ఎన్‌సీపీ చీఫ్ పదవి నుంచి దిగిపోతున్నట్టు ప్రకటించారు. 1999 నుంచి ఆయన ఎన్‌సీపీ చీఫ్‌గా ఉన్నారు. పవార్ తన ఆటోబయోగ్రఫీ రివైజ్డ్ వెర్షన్‌ను విడుదల చేస్తూ ఈ ప్రకటన చేశారు. పవార్ నిర్ణయాన్ని జీర్ణించుకోలేని ఆ పార్టీ, కార్యకర్తలు ఆ వేదక వద్దే నిరసన తెలిపారు. కొందరు కంటతడి పెట్టారు. అనంతరం ముంబైలో నేతలు, కార్యకర్తలు నిరసనలకు దిగారు. పార్టీ పదవులకు రాజీనామాలు కూడా మొదలుకావడంతో పలువురు పార్టీ నేతలు పవార్‌ను కలిసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇందుకు అంగీకరించిన పవార్, తనకు రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని వారికి సూచించారు. ఎన్‌సీపీ నేత, పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఈ విషయాన్ని ఆందోళనకు దిగిన పార్టీ కార్యకర్తలకు తెలియజేసి వారిని శాంతింపచేశారు.
Updated Date - 2023-05-02T20:21:19+05:30 IST