Karnataka Congress: కర్ణాటకకు కాబోయే సీఎం డీకేనా, సిద్దరామయ్యనా తర్వాత సంగతి.. అంత కంటే పెద్ద విషయమే తెలిసింది..!
ABN, First Publish Date - 2023-05-16T13:56:35+05:30
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రస్తుతం హోరాహోరీ పోరాటం జరుగుతోంది.
బెంగళూరు : కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రస్తుతం హోరాహోరీ పోరాటం జరుగుతోంది. చర్చలు, నిర్ణయాలు బెంగళూరు నుంచి ఢిల్లీకి మారాయి. కాంగ్రెస్ అధిష్ఠానం ఆశీస్సులతో ఎవరు తిరిగి వస్తారోననే ఉత్కంఠత అందరిలోనూ ఉంది. అయితే ఆ ముళ్ల కిరీటాన్ని ధరించే నేత మాత్రం తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి చాలా శ్రమించక తప్పదు. ఈ హామీల భారం బడ్జెట్‌లో దాదాపు 20 శాతం వరకు కనిపించడమే దీనికి కారణం.
కాంగ్రెస్ ఘన విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ప్రజలకు ఆశ చూపిన ఉచిత పథకాలు. ఉచిత ప్రయాణాలు, నిరుద్యోగ భృతి, మహిళలకు ప్రత్యేక సదుపాయాలు, ఉచిత విద్యుత్తు, మత్స్యకారులకు డీజిల్, ఆర్థిక సాయం; ఆవు పేడ కొనుగోలు వంటి హామీల ప్రభావం బాగా కనిపించినట్లు విశ్లేషకులు చెప్తున్నారు. వీటన్నిటినీ నెరవేర్చాలంటే సంవత్సరానికి దాదాపు రూ.62 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా.
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ముఖ్యమైన హామీలు :
- ప్రతి కుటుంబ మహిళా పెద్దకు నెలకు రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం
- నిరుద్యోగ డిప్లమో హోల్డర్‌కు నెలకు రూ.1,500
- నిరుద్యోగ గ్రాడ్యుయేట్‌కు నెలకు రూ.3,000
- రాష్ట్ర రోడ్డు రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం
- ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు
- సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు సంవత్సరానికి 500 లీటర్ల పన్ను రహిత డీజిల్
- చేపల వేట లేని రోజుల్లో మత్స్యకారులకు రూ.6,000 ఆర్థిక సాయం
- కేజీ రూ.3 చొప్పున ఆవు పేడ కొనుగోలు
- గ్రామాల్లో ఎరువుల తయారీ కేంద్రాల ఏర్పాటు, మహిళలు/యువతకు భాగస్వామ్యం
ఈ హామీల ఖరీదును లెక్కగట్టినపుడు కేవలం నగదు చెల్లింపులు, విద్యుత్తు రాయితీలకే సంవత్సరానికి రూ.62,000 కోట్లు అవసరమని వెల్లడైంది. ఈ ఖర్చు భరించాలంటే రాష్ట్ర బడ్జెట్‌కు భారమవుతుంది. రూ.62,000 కోట్లు అంటే రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు 20 శాతం అన్నమాట. గత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటుతో సమానమైన నిధులను ప్రధాన ఉచిత పథకాల కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. 2023-24 సంవత్సరంలో కర్ణాటక బడ్జెట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్య లోటు రూ.60,581 కోట్లు. ఇది స్థూల రాష్ట్ర ఉత్పత్తి (GSDP)లో 2.60 శాతం.
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఇన్‌ఛార్జి రణదీప్ సింగ్ సుర్జీవాలా మాట్లాడుతూ, తాము ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి రాష్ట్ర బడ్జెట్‌లో 15 శాతం కన్నా ఎక్కువ ఖర్చు కాబోదన్నారు. అంతేకాకుండా రానున్న ఐదేళ్లలో బడ్జెట్ పరిమాణం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇదిలావుండగా, కర్ణాటకలో రెవిన్యూ వృద్ధి పటిష్టంగా ఉంది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక జీఎస్‌టీ వసూళ్లు చేసిన రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రెవిన్యూ వసూళ్ళ లక్ష్యం రూ.72,000 కోట్లు కాగా, జనవరి ముగిసేనాటికి (జీఎస్‌టీ నష్టపరిహారం మినహా) రూ.83,010 కోట్లు వసూలైంది. అంటే బడ్జెట్ అంచనా కన్నా ఇది 15 శాతం ఎక్కువ.
అప్పులు ఆందోళనకరం
కర్ణాటక ప్రభుత్వ అప్పులు ఐదేళ్లలో రూ.3.6 లక్షల కోట్లు పెరిగాయి, అంటే రూ.5.6 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే ధోరణి కొనసాగితే రానున్న మూడేళ్లలో రూ.1.7 లక్షల కోట్లు అప్పు చేసే అవకాశం ఉంది. 30 శాతం పెరిగితే 2026-27 ఆర్థిక సంవత్సరంనాటికి మొత్తం అప్పులు రూ.7.3 లక్షల కోట్లు అవుతుంది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరంనాటికి రెవిన్యూ రిసీప్ట్స్ దాదాపు 30 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా. దీనివల్ల రుణాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు.
డిసెంబరులో జరిగిన శాసన సభ సమావేశాల్లో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం, అప్పులు ప్రస్తుత వేగంతోనే వృద్ధి చెందితే, కేవలం వడ్డీల చెల్లింపుల కోసం 2023-24లో రూ.35,090 కోట్లు; 2024-25లో రూ.38,629 కోట్లు; 2025-26లో రూ.47,899 కోట్లు అవసరమవుతాయి. రానున్న మూడేళ్లలో మిగిలినవన్నీ నిలకడగా ఉంటూ, వడ్డీల భారం 30 శాతం పెరిగితే, 2026-27లో కనీసం రూ.50,300 కోట్లు అవసరమవుతాయి. రానున్న సంవత్సరాల్లో కర్ణాటక ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున వృద్ధి చెందినప్పటికీ, ప్రధాన ఉచిత పథకాల కోసం రూ.62,000 కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులను సమకూర్చడం భారంగా పరిణమించవచ్చు.
ఉద్యోగాల భర్తీ హామీ
ప్రభుత్వ శాఖల్లో 2.5 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఈ హామీని నెరవేర్చితే ప్రభుత్వ జీతాల బిల్లు పెరుగుతుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్ ప్రభావితమవుతుంది. ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తే రాష్ట్రంలో విద్యుత్తు రంగం ప్రభావితమవుతుంది. కర్ణాటక మిగులు విద్యుత్తు రాష్ట్రం అయినప్పటికీ, ఈ రంగం రక్తమోడుతోంది. ఐదు విద్యుత్తు సరఫరా కంపెనీల క్యుములేటివ్ నష్టాలు రూ.14,401 కోట్లు, దీనిలో రూ.4,581 కోట్లు ఈ ఏడాది వచ్చిన నష్టం. విద్యుత్తు సరఫరా కంపెనీల క్యుములేటివ్ అప్పులు ఫిబ్రవరిలో రూ.20,250 కోట్లు. దీని పర్యవసానాలు ఇప్పటికే కనిపిస్తున్నాయి. విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్ కంపెనీలకు చెల్లించవలసిన సొమ్మును విద్యుత్తు సరఫరా కంపెనీలు చెల్లించలేకపోతున్నాయి.
బిల్లులను చెల్లించని సంస్థల జాబితాలో ప్రభుత్వ శాఖలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలు ఉన్నాయి. ఇవి రూ.8,363 కోట్లు బాకీపడ్డాయి. భాగ్య జ్యోతి, సాగునీటి పంప్ సెట్ల కోసం ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం కూడా రూ.8,584 కోట్లు బాకీ పడింది.
మన దేశంలో ఉచిత పథకాలు ప్రధాన సమస్యగా మారాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దీనిని రేవిడి కల్చర్ అన్నారు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. ఉచిత పథకాల హామీలతో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ప్రతిపక్షాలు ఉచిత పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. కర్ణాటకలో కూడా ఇటువంటి హామీలతోనే కాంగ్రెస్ గెలవడంతో ఇక ఏ పార్టీ అయినా ఈ హామీలను ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది. దీని ప్రభావం దీర్ఘ కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా, ప్రతికూలంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Karnataka CM Race : పెదవి కదపని సిద్ధరామయ్య
Karnataka CM Tussle : కాసేపట్లో ఢిల్లీకి డీకే శివ కుమార్
Updated Date - 2023-05-16T13:56:35+05:30 IST