Jayalalitha Death: మోదీపై డీఎంకే ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
ABN, First Publish Date - 2023-01-08T18:29:24+05:30
తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగం ఎమ్మెల్యే మార్కండేయన్ సంచలన ఆరోపణలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి వెనుక...
చెన్నై: తమిళనాడులోని అధికార ద్రవిడ మున్నేట్ర కళగం (DMK) ఎమ్మెల్యే మార్కండేయన్ (Markandeyan) సంచలన ఆరోపణలు చేశారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha) మృతి వెనుక బీజేపీ (BJP), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉన్నారని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
''ఆ మహిళను (జయలలిత) ఎవరు చంపారు? మోదీనే ఆమెను చంపారు. ప్రధానమంత్రి పదవికి ఆయనపై ఆమె పోటీపడ్డారు'' అని ఆ వీడియోలో మార్కండేయన్ ఆరోపించారు. ''ఆమె ఎలా పోటీచేస్తారు? నాపై ఎవరూ పోటీ చేయకూడదు. మోదీ చెప్పిన మాట ఇది'' అంటూ ఆయన సంచలన అభియోగాలు చేశారు.
మండిపడిన బీజేపీ
జయలలిత మృతి వెనుక బీజేపీ, ప్రధాని మోదీ ఉన్నారంటూ డీఎంకే ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై బీజేపీ భగ్గుమంది. డీఎంకే ఎమ్మెల్యే అబద్ధాలు చెప్పడానికి అలవాటుపడ్డారని, ప్రభుత్వ పాలనలోని అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే డీఎంకే ఇలాంటి జిమ్మిక్కులకు పాల్పడుతోందని బీజేపీ నేత ఎస్‌జీ సూరయ్య అన్నారు. ఇచ్చిన వాగ్దానాలకు డీఎంకే సర్కార్ కట్టుబడలేదనే కోపం ప్రజల్లో నెలకొందని చెప్పారు. హోం మంత్రి పదవిని కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి స్టాలిన్ వెంటనే మార్కండేయ ప్రకటనపై వివరణ ఇవ్వాలని, లేకుంటే ఎమ్మెల్యే అరెస్టు కోరుతూ లీగల్ చర్యలకు దిగుతామని హెచ్చరించారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సైతం ఓ ట్వీట్‌లో ఎమ్మెల్యే ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు డీఎంకే ఎమ్మెల్యే అబద్ధాలకు పాల్పడుతున్నారని, బీజేపీ రాష్ట్ర విభాగం ఎప్పటికీ మౌన ప్రేక్షకునిలా చూస్తుండదనే విషయం ముఖ్యమంత్రి గ్రహించాలని అన్నారు.
Updated Date - 2023-01-08T18:31:19+05:30 IST