Elections: ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఎదురే లేదు.. కానీ.. తాజా పరిస్థితి చూస్తే...
ABN, First Publish Date - 2023-04-02T09:30:37+05:30
గార్డెన్‌సిటీ బెంగళూరు నగరంలోని ప్రతిష్టాత్మక శాసనసభా నియోజకవర్గాల్లో రాజాజీనగర్ ఒకటి. ఇది క్రమేపీ బీజేపీ కంచుకోటగా మారిపోయింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గార్డెన్‌సిటీ బెంగళూరు నగరంలోని ప్రతిష్టాత్మక శాసనసభా నియోజకవర్గాల్లో రాజాజీనగర్ ఒకటి. ఇది క్రమేపీ బీజేపీ కంచుకోటగా మారిపోయింది. 1978 నుంచి ఇంతవరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే 1989, 2004 ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ గెలుపొందింది. జనతాపార్టీ ఒకసారి ఇక్కడ విజయకేతనం ఎగురవేయగా సీపీఐ రెండు సార్లు విజయం సాధించింది. ఎంఎస్ కృష్ణన్ ఉన్నంత వరకు ఇక్కడ వామపక్షాల ప్రభావం ఉండేది. మొత్తం మీద ఐదుసార్లు ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ విజయం సాధించింది. ఐదుసార్లు విజయాన్ని అందుకున్న సురేష్‌కుమార్(Suresh Kumar) మరోసారి టికెట్‌ను ఆశిస్తున్నారు. మంత్రి పదవిని త్యాగం చేసిన అనంతరం సురేష్‌కుమార్ నియోజకవర్గం ఓటర్లతో బాగా మమేకమయ్యారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎమ్మెల్యే, మంత్రి స్థాయికి ఎదిగిన సురేష్‌కుమార్ బాగా సీనియర్ అయినప్పటికీ రెండు దశాబ్దాలకు పైగా పార్టీ కోసం శ్రమిస్తున్న తనకు ఈసారి అవకాశం కల్పించాలని పార్టీ నేత రఘునాథ్ పార్టీ పెద్దలకు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు బీజేపీ టికెట్‌ను ఆశిస్తున్న ప్రముఖుల్లో బీబీఎంపీ(BBMP) మాజీ కార్పొరేటర్లు మంజునాథ్, రంగణ్ణ ఉన్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే నగర మాజీ మేయర్ జీ పద్మావతి మరోసారి ఇక్కడ పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. రాజాజినగర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలు మంజుళా నాయుడు, భవ్యా నరసింహమూర్తి, రఘువీర గౌడ, యువనేత మనోహర్‌ను కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Sivakumar), ప్రతిపక్ష నేత సిద్దరామయ్య స్వయంగా పిలిపించి బుజ్జగించారు. ఎవరికి టికెట్ ఇచ్చినా కలసికట్టుగా పనిచే స్తామని వారితో ప్రమాణాలు చేయించుకున్నారు. అనంతరం జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య బీజేపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన పుట్టణ్ణ పేరును కాంగ్రెస్ అభ్యర్ధిగా ఖరారు చేశారు. జేడీఎస్ ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థిగా గంగాధరమూర్తి పేరును ఖరారు చేసింది. ఇక బీజేపీ అభ్యర్ధి పేరు మాత్రమే ప్రకటించాల్సి ఉంది. రాజాజినగర్‌లో ఈ సారి త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఏడుసార్లు పోటీచేసి ఐదుసార్లు గెలిచిన సురేష్‌కుమార్
సురేష్ కుమార్ రాజాజినగర్ నియోజకవర్గం నుంచి మొత్తం ఏడుసార్లు పోటీచేసి ఐదుసార్లు గెలిచారు. మంచి వక్త అయిన సురేష్‌కుమార్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారు. వీరి సతీమణి పాత్రికేయురాలు కావడంతో సహజంగానే సురేష్‌కుమార్‌కు పాత్రికేయులతో సత్సంబంధాలున్నాయి. పార్టీ అధిష్టానం తనకు మరోసారి అవకాశం ఇస్తుందన్న ఆశాభావం తో సురేష్ కుమార్ ఉన్నారు.
పుంజుకున్న కాంగ్రెస్
రాజాజీనగర్‌లో గత మూడు సాధారణ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ బాగా పుంజుకుందనే చెప్పాలి. 2008 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీకి 49,655 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 34,995 ఓట్లు, జేడీఎస్‌కు 7,422 ఓట్లు దక్కాయి. ఇక 2013 ఎన్నికల్లో బీజేపీ ఓట్లు దాదాపు 10వేలకు పైగా తగ్గాయి. ఆ పార్టీకి 39,291 ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 24,524 ఓట్లు, జేడీఎస్‌కు 20,909 ఓట్లు లభించాయి. 2018 ఎన్నికల్ల ఇక్కడ పోరు హోరాహోరీగా సాగింది. అప్పటి ఎన్నికల్లో బీజేపీకి 56,271 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు 46,818 ఓట్లు లభించాయి. జేడీఎస్ 9,168 ఓట్లతో సరిపెట్టుకోక తప్పలేదు. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,00,287 మంది ఓటర్లు ఉం డగా ఇందులో 1,01,976 మంది పురుష ఓటర్లు, 99,304 మంది మహిళా ఓటర్లు, ఏడుగురు హిజ్రా ఓటర్లు ఉన్నారు.
Updated Date - 2023-04-02T09:30:37+05:30 IST