Elections: చివరి క్షణంలో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్, బీజేపీ
ABN, First Publish Date - 2023-04-21T08:05:35+05:30
నామినేషన్‌ల గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP)లు పెండింగ్‌లో ఉండే అభ్యర్థులను ఖరారు చేసింది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి) : నామినేషన్‌ల గడువు ముగిసేందుకు కొన్ని గంటల ముందు కాంగ్రెస్, బీజేపీ(Congress, BJP)లు పెండింగ్‌లో ఉండే అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీలో రెండు స్థానాలు పెండింగ్‌లో ఉండేవి. బుధవారం రాత్రి పొద్దుపోయాక అభ్యర్థులను ప్రకటించారు. మాన్వి నియోజకవర్గానికి బీవీ నాయక్‌ను, శివమొగ్గకు చన్నబసప్పను ఖరారు చేశారు. శివమొగ్గ(Shivamogga) స్థానం నుంచి వరుసగా సీనియర్‌నేత కేఎస్ ఈశ్వరప్ప ప్రాతినిధ్యం వహిస్తుండేవారు. ఆయనకు టికెట్ ఇచ్చేది లేదని అధిష్టానం సూచించిన మేరకు ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. చివరి క్షణందాకా ఈశ్వరప్ప కుమారుడు కాంతరాజు టికెట్ వస్తుందని భావించారు. అనూహ్యంగా చన్నబసప్ప పేరు ఖరారైంది. బీజేపీ జాబితా ఉత్కంఠ రేకెత్తించింది.
కాంగ్రెస్ చివరి ఐదుగురి పేర్లు ఖరారు
కాంగ్రెస్ పార్టీ చివరిగా మిగిలిన ఐదు నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. బుధవారం రాత్రి పొద్దుపోయాక జాబితాను విడుదల చేశారు. రాయచూరుకు మహమ్మద్ సలాం, శిడ్లఘట్ట బీవీ రాజీవ్‌గౌడ, సీవీ రామన్ నగర్‌కు ఆనంద్‌కుమార్, అరకలగూడుకు హెచ్‌పీ శ్రీధర్‌గౌడ, మంగళూరు నగర తూర్పుకు ఇనాయత్ అలీల పేర్లను ఖరారు చేశారు. కాగా బుధవారం విడుదల చేసిన నలుగురు అభ్యర్థుల జాబితాలో ప్రకటించిన ముళబాగిలు అభ్యర్థి పేరు చివరిక్షణంలో మార్పు జరిగింది. తొలుత ముళబాగిలు అభ్యర్థిగా డాక్టర్ బిసీ ముద్దుగంగాధర్ పేరు ప్రకటించారు. కానీ గురువారం ఉదయం ముద్దుగంగాధర్ స్థానంలో ఆదినారాయణకు టికెట్ కేటాయించారు. డీకే శివకుమార్ ఆదినారాయణకు బీపారం ఇచ్చారు.
Updated Date - 2023-04-21T08:05:35+05:30 IST