Email Bomb Threat: 11 చోట్ల బాంబులు.. బెంబేలెత్తించిన ఈ-మెయిల్ బాంబు బెదిరింపు..
ABN, Publish Date - Dec 26 , 2023 | 07:28 PM
ఆర్థిక రాజధాని ముంబైలో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బాంబు బెదరింపు ఒకటి మంగళవారంనాడు తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఐ, మరో రెండు ప్రైవేటు బ్యాంకులను పేల్చివేస్తామని ఈ-మెయిల్ సెండర్ బెదిరించాడు. తాము 'ఖిలాఫత్ ఇండియా'కు చెందినట్టు అతను క్లెయిమ్ చేసుకున్నాడు.
ముంబై: ఆర్థిక రాజధాని ముంబై(Mumbai)లో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బాంబు బెదరింపు (Email Bomb Threat) ఒకటి మంగళవారంనాడు తీవ్ర కలకలం రేపింది. ఆర్బీఐ (RBI), మరో రెండు ప్రైవేటు బ్యాంకులను పేల్చివేస్తామని ఈ-మెయిల్ సెండర్ బెదిరించాడు. తాము 'ఖిలాఫత్ ఇండియా' (Khilafat Indaia)కు చెందినట్టు అతను క్లెయిమ్ చేసుకున్నాడు. మధ్యాహ్నం 1.30 గంటల కల్లా తమ డిమాండ్లు నెరవేర్చకుంటే ఫోర్ట్‌లోని ఆర్బీఐ సెంట్రల్ ఆఫీస్ ఆఫీసు భవంతి, చర్చిగేట్ వద్దనున్న హెచ్‌డీఎఫ్‌సీ హౌస్, కుర్లా క్లాంపెక్స్‌లోని ఐసీఐసీసీ బ్యాంకు టవర్ల పేల్చేస్తామని అజ్ఞాతవ్యక్తి బెదిరించాడు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ తమ పదవులకు తక్షణం రాజీనామా చేయాలని అతను డిమాండ్ చేశాడు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంలో ఆర్బీఐ, ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్, మరికొంత మంది టాప్ బ్యాంకర్లు, మంత్రుల ప్రమేయం ఉందని అతను ఆరోపించాడు. ఇందుకు తమవద్ద తగినన్ని సాక్ష్యాలు ఉన్నట్టు చెప్పాడు.
ముంబై పోలీసులు అప్రమత్తం
నగరంలో 11 చోట్ల బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ బెదిరింపులతో అప్రమత్తమైన పోలీసులు ఆయా చోట్ల విస్తృతంగా గాలింపులు జరిపారు. అయితే బాంబు కానీ, అనుమానించదగిన వస్తువులు కానీ కనిపించకపోవడంతో ఈ-మెయిల్ బెదిరింపు ఉత్తదేనని తేలింది. క్రిమినల్ ఇంటిమిడేటన్ కింద కేసు నమోదు చేసుకుని, ఈ-మెయిల్ ఎక్కడ నుంచి వచ్చింది, దీని వెనుక ఉద్దేశం ఏమిటనే దానిపై దర్యాప్తు జరుపుతున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. ఈ-మెయిల్ హెచ్చరికల నేపథ్యంలో ఆర్బీఐ, ఇతర బ్యాంకుల వద్ద భద్రతను మరింత పెంచారు. కాగా, ఈ-మెయిల్ బాంబు బెదిరింపుపై ఆర్బీఐ కానీ, బ్యాంకులు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తక్షణం రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై ఆర్థిక మంత్రి, ఆర్బీఐ గవర్నర్ సైతం స్పందించలేదు.
Updated Date - Dec 26 , 2023 | 07:43 PM