Budget 2023 : స్వయం సహాయక బృందాల మహిళలపై ఆర్థిక సర్వే నివేదిక ప్రశంసలు
ABN, First Publish Date - 2023-01-31T14:13:19+05:30
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని 2022-23 ఆర్థిక సర్వే నివేదిక
న్యూఢిల్లీ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వల్ల మన దేశ ఎగుమతులపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని 2022-23 ఆర్థిక సర్వే నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంటుకు సమర్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం నుంచి 6.8 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ సర్వే అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ వృద్ధి రేటు 7 శాతం ఉంటుందని అంచనా. అంటే వచ్చే ఏడాది ఈ సంవత్సరం కన్నా తక్కువ వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది.
పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు రోజు ఆర్థిక సర్వే నివేదికను సమర్పిస్తారు. గత ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ పనితీరును ఈ నివేదిక వివరిస్తుంది. నిర్మల సీతారామన్ బుధవారం కేంద్ర బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ 6.8 శాతంతో వృద్ధి చెందడమంటే, ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మన దేశం స్థానం కొనసాగుతున్నట్లే.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో మన దేశ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) నామినల్ టెర్మ్స్‌లో 11 శాతం ఉంటుందని ఈ సర్వే అంచనా వేసింది. మౌలికాంశాలు బలంగా ఉండటం వల్ల భారత దేశ వృద్ధి నిలకడగా కొనసాగుతుందని పేర్కొంది. అత్యధిక మూలధన వ్యయం, ప్రైవేట్ వినియోగం, చిన్న తరహా వ్యాపార సంస్థలకు ఇచ్చే రుణాలు పెరగడం, కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ పటిష్టంగా ఉండటం, వలస కార్మికులు తిరిగి నగరాలకు చేరుకుంటుండటం వంటివాటివల్ల జీడీపీ వృద్ధి నిలకడగా కొనసాగుతుందని తెలిపింది. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒడుదొడుకుల నడుమ ఈ అంచనాలు గట్టి భరోసాను ఇస్తున్నాయి. ఇదిలావుండగా, కరంట్ అకౌంట్ లోటు మరింత విస్తరిస్తే, ఇండియన్ కరెన్సీ రూపాయి ఒత్తిళ్ళకు గురవుతుందని తెలిపింది.
కొనుగోలు శక్తినిబట్టి చూసినపుడు భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో మూడో స్థానంలోనూ, ఎక్స్ఛేంజ్ రేట్‌ను బట్టి చూసినపుడు ఐదో స్థానంలోనూ ఉంటుందని ఈ నివేదిక పేర్కొంది.
భారత దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు కోలుకుందని ఈ నివేదిక పేర్కొంది. కోవిడ్-19 మహమ్మారి, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమయాల్లో మందగమనం నుంచి తేరుకున్నట్లు, మళ్లీ పుంజుకున్నట్లు తెలిపింది.
కరంట్ అకౌంట్ డెఫిసిట్‌కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్లు ధీమా వ్యక్తం చేసింది. రూపాయి విలువలో చంచలత్వాన్ని సర్దుబాటు చేయగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. ప్రపంచంలోని ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోల్చినపుడు సీపీఐ (వినియోగదారుల ధరల సూచీ) ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వు బ్యాంకు నిర్దేశిత పరిమితి కన్నా మించిపోలేదని పేర్కొంది.
కోవిడ్ మహమ్మారి సమయంలో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనడంలో స్వయం సహాయక సంఘాల మహిళలు పోషించిన పాత్రను ఈ నివేదిక ప్రత్యేకంగా వివరించింది. మాస్క్‌లను తయారు చేయడంలో, వాటిని గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రజలు వాడేలా చేయడంలో ఈ మహిళల పాత్రను ప్రశంసించింది.
Updated Date - 2023-01-31T14:36:22+05:30 IST