Sukhjinder Singh Randhawa: మోదీని లేపేస్తేనే.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-03-13T19:16:41+05:30
కాంగ్రెస్ తనకు సమాధి కట్టాలనుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హుబ్లి సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సద్దుమణగక ముందే..
జైపూర్: కాంగ్రెస్ తనకు సమాధి కట్టాలనుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల హుబ్లి సభలో చేసిన వ్యాఖ్యలు కలకలం సద్దుమణగక ముందే.. కాంగ్రెస్ నేత ఒకరు ప్రధానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. "మోదీ ఫినిష్ అయితేనే, దేశం సురక్షితంగా ఉంటుంది'' అని కాంగ్రెస్ నాయకుడు సుఖ్జిందర్ సింగ్ రంధావా (Sukhjinder Singh Randhawa) అన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
''మోదీని తుదముట్టిస్తేనే దేశాన్ని కాపాడగలుగుతాం. ఆయన ఉంటే దేశం అంతమవుతుంది. దేశభక్తి అంటే ఏమిటో మోదీకి తెలియదు. క్రమశిక్షణ అనేది కనుక ఉంటే ఒకే రోజులో అదానీని దేశం నుంచి గెంటేయగలం. ముందు బీజేపీని తుదముట్టించాలి. దాంతో అదానీ కూడా ఫినిష్ అవుతాడు. దేశాన్ని మోదీ అమ్ముకుంటున్నారు. మన పోరాటం అదానీపై కాదు. అంబానీ, అదానీలను కటకటాల వెనక్కి నెట్టాలి'' అని రంధావా అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విపక్ష పార్టీల నేతలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో పలు సందర్భాల్లో ఈ తరహా అనుచిత వ్యాఖ్యలు చేశారు. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని వారంరోజుల క్రితం లండన్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు సోమవారంనాడు ప్రారంభం కాగానే ఇదే విషయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో, పీయూష్ గోయల్ రాజ్యసభలో ప్రస్తావించారు. లోక్‌సభ సభ్యుడిగా ఉన్న రాహుల్ ఇదే సభను లండన్‌లో అవమానపరుస్తూ మాట్లాడారని, సభాముఖంగా రాహుల్ క్షమాపణ చెప్పాలని రాజ్‌నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని రాహుల్ గాంధీ కోరినట్టు కూడా మంత్రి ఆరోపించారు.
Updated Date - 2023-03-13T19:24:42+05:30 IST