Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. సీఎం సిద్దరామయ్య మిత్రద్రోహి.. ఆయన వల్లే ప్రభుత్వం కుప్పకూలింది..
ABN, First Publish Date - 2023-10-25T13:18:16+05:30
రాష్ట్రంలో గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం వెనుక సిద్దరామయ్య(Siddaramaiah) పరోక్ష హస్తం ఉందని
- ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఆయనకు మామూలే : సీఎం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలడం వెనుక సిద్దరామయ్య(Siddaramaiah) పరోక్ష హస్తం ఉందని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి(Former CM HD Kumaraswamy) ఆరోపించారు. బెంగళూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీతో అప్పట్లో చేతులు కలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరి అనుచరులన్న సంగతి లోకమంతా తెలుసునన్నారు. ఇప్పుడు తనకు ఏం సంబంధం లేదన్నట్టు సిద్దరామయ్య మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. సిద్దరామయ్యకు తెలిసే అప్పట్లో అంతా జరిగిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోవడంతో గత్యంతరం లేక తనను సీఎం చేసేందుకు తొలుత అంగీకరించిన సిద్దరామయ్య ఆపై వెన్నుపోట్లు పొడిచారన్నారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన జేడీఎస్(JDS)కు వెన్నుపోట్లు పొడిచారని, ఇప్పుడు నైతిక విలువల గురించి కూనిరాగాలు తీస్తున్నారని మండిపడ్డారు. కాగా కుమారస్వామి వ్యాఖ్యలను సిద్ద రామయ్య తిప్పికొట్టారు. మైసూరులో మీడియాతో మాట్లాడుతూ పచ్చిఅబద్దాలు ఆడడం కుమారస్వామికి వెన్నతోపెట్టిన విద్య అన్నారు. మరి ఈ విషయాలన్నీ అప్పుడే ఎందుకు చెప్పలేదంటూ నిలదీశారు. తమకు అనుకూలమైన సమయంలో అబద్ధాలను కథలుగా అల్లి ప్రచారం చేయడం కుమారస్వామికి బాగా అలవాటంటూ సీఎం చురకలంటించారు. రాష్ట్రాన్ని విద్యుత్ సంక్షోభంలోకి నెట్టివేసినట్టు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సీఎం తిప్పికొట్టారు. వర్షాభావ పరిస్థితి, విద్యుత్ ఉత్పాదన కుంటుపడడం వంటివి ప్రధాన కారణాలన్నారు. ఏడాదిక్రితం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 11వేల మెగావాట్లు కాగా ప్రస్తుతం ఇది 16వేల మెగావాట్లకు పెరిగిందన్నారు. ఇంత భారీగా విద్యుత్‌ను కొనుగోలు చేసి లోటును పూడ్చుకోవడం ప్రభుత్వానికి ఒకింత సవాల్‌గానే ఉందన్నారు. అయినా సమస్యను అధిగమిం చేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామన్నారు.
Updated Date - 2023-10-25T13:18:16+05:30 IST