Russia Ukraine war: యుద్ధాన్ని ఆపడంలో సహకరించాలని భారత్‌కు ఫ్రాన్స్ వినతి
ABN, First Publish Date - 2023-02-22T21:06:55+05:30
యుద్ధాన్ని ముగించేలా సాయం చేయాలని ఫ్రాన్స్(France ) దౌత్యవేత్తలు భారత్‌ను కోరారు.
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia Ukraine war) ప్రారంభమై ఏడాది కావొస్తోంది. ఈ తరుణంలో ఐక్యరాజ్యసమితి(UN)లో ప్రవేశపెట్టబోయే శాంతి ప్రణాళికకు భారత్(India) అనుకూలంగా ఓటెయ్యాలని ఉక్రెయిన్ (Ukraine) అధ్యక్ష కార్యాలయం కోరింది. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్(Ajit Doval)కు ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం చీఫ్ యాండ్రీ యెర్మాక్ ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరారు. రష్యా(Russia) నుంచి తాము ఒక్క సెంటీమీటర్ భూమి కూడా కోరుకోవడం లేదని, తమ భూభాగం తమకు ఇవ్వాలని మాత్రమే కోరుతున్నట్లు స్పష్టం చేశారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా సేనలు పూర్తిగా వైదొలగాలని మాత్రమే తాము కోరుతున్నట్లు వివరించారు.
మరోవైపు యుద్ధాన్ని ముగించేలా సాయం చేయాలని ఫ్రాన్స్(France ) దౌత్యవేత్తలు భారత్‌ను కోరారు.
గత ఏడాది ఫిబ్రవరి 24న మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇప్పటివరకూ వేలాది మంది చనిపోయారు. లక్షలమంది నిరాశ్రయులయ్యారు. అదే సంఖ్యలో విదేశాలకు వలస వెళ్లారు. భారత విద్యార్ధులతో పాటు అనేక దేశాల విద్యార్థులు చదువులు మధ్యలో ఆపేసి స్వదేశాలకు తిరిగిరావాల్సి వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Biden) ఇటీవలే కీవ్‌లో పర్యటించారు. మద్దతుతో పాటు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించారు. అమెరికా తీరుపై రష్యా గుర్రుగా ఉంది. తమపై ఆంక్షలు విధించినా ఆర్ధికంగా ఎదుగుతున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించుకున్నారు. చైనా (China) విదేశాంగ మంత్రి ఇప్పటికే మాస్కోలో పుతిన్(Putin)ను కలుసుకున్నారు.
యుద్ధాలకు ఇది సరైన సమయం కాదని, యుద్ధాలు తగవని, శాంతియుతంగా సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ రష్యాకు సూచించింది. పుతిన్‌తో మోదీ(Narendra Modi) చెప్పిన శాంతివచనాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.
Updated Date - 2023-02-22T21:07:00+05:30 IST