14న ఆవును కౌగిలించుకోండి
ABN , First Publish Date - 2023-02-09T01:41:46+05:30 IST
గో ప్రేమికులు అందరూ ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది...

కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపు
గోవును ఆలింగనం చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అని వ్యాఖ్య
ఫబ్రవరి 14న ‘కౌ హగ్ డే’!
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: గో ప్రేమికులు అందరూ ఫిబ్రవరి 14న ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది. భారతదేశ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నెముక లాంటిదని.. అందుకే ఆవును ‘కామధేనువు’, ‘గోమాత’గా పేర్కొంటామని తెలిపింది. ‘భారతీయులు పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడిపోవడం వల్ల దేశంలో వైదిక సంప్రదాయాలు అంతరించిపోతున్నాయి. ఆవును కౌగిలించుకుంటే వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుంది. ఆవును కామధేను అని, గోమాత అని తల్లిలా పూజిస్తాం. ఆవుతో కలిగే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా గోవులను కౌగిలించుకోవాల (కౌ హగ్ డే)ని కోరుతున్నాం’ అని బోర్డు కార్యదర్శి ఎస్.కె.దత్తా పేర్కొన్నారు. కేంద్ర పశుసంవర్ధక శాఖ అనుమతి తీసుకొనే ఈ మేరకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. ఫిబ్రవరి 14ను ప్రపంచమంతా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటుంది. అది భారతీయ, హిందూ సంస్కృతి కాదంటూ పలు హిందూ సంఘాలు ఆ రోజు నిరసనలూ తెలుపుతుంటాయి. ఈ క్రమంలో కేంద్ర పశు సంక్షేమ బోర్డు ఫిబ్రవరి 14ను ‘కౌ హగ్ డే’గా జరుపుకోవాలని పిలుపునివ్వడం గమనార్హం.