Indian Army : పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న భారత సైనికుడు!
ABN, First Publish Date - 2023-02-18T16:30:27+05:30
చైనా సరిహద్దుల్లో భారతీయ రక్షణ దళాల కార్యకలాపాల గురించి పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి రహస్యంగా చేరవేస్తున్న సైనికుడిని
న్యూఢిల్లీ : చైనా సరిహద్దుల్లో భారతీయ రక్షణ దళాల కార్యకలాపాల గురించి పాకిస్థాన్ దౌత్య కార్యాలయానికి రహస్యంగా చేరవేస్తున్న సైనికుడిని భారత సైన్యం గుర్తించింది. ఇతనిపై రెండు, మూడు రోజుల్లో కోర్ట్ మార్షల్ (విచారణ) జరగబోతోంది. వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా దురాక్రమణ బుద్ధితో దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న సమయంలో అత్యంత సాధారణ సమాచారం సైతం శత్రు దేశాలకు ఉపయోగపడుతుందని సైనికాధికారులు చెప్తున్నారు.
విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం, భారత సైన్యంలో సిగ్నల్‌మేన్ (వాషర్‌మేన్)గా పని చేస్తున్న అలీం ఖాన్ (Alim Khan) చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను అక్కడి భారత సైన్యం నిర్వహించే కార్యకలాపాల గురించి న్యూఢిల్లీలోని పాకిస్థాన్ ఎంబసీలో పని చేస్తున్న పాకిస్థానీ గూఢచారి అబిద్ హుస్సేన్ వురపు నాయక్ అబిద్‌కు చేరవేశాడు. ఈ దారుణం జరుగుతుండగా అతనిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తాను పని చేస్తున్న దళంలో గార్డు డ్యూటీల వివరాలు, ఆ దళం కార్యకలాపాలు, ఉపయోగిస్తున్నవాహనాలు, కోవిడ్ లాక్‌డౌన్ సందర్భంగా వాహనాల కదలికలు వంటివాటిని రహస్యంగా అందజేశాడు. చైనా సరిహద్దులను పర్యవేక్షిస్తున్న ఉపగ్రహాల స్థానాన్ని, నిఘా రాడార్, ఇతర పరికరాల స్థానాలను తెలుసుకునేందుకు ఇతను విఫలయత్నం చేశాడు. అబిద్ పాకిస్థానీ జాతీయుడు. పాకిస్థాన్ కోసం న్యూఢిల్లీలో పని చేస్తున్నాడు.
నిందితుడు అలీం ఖాన్‌పై సమ్మరీ కోర్ట్ మార్షల్ (విచారణ) రెండు, మూడు రోజుల్లో ప్రారంభమవుతుందని భారత సైనికాధికారులు తెలిపినట్లు జాతీయ మీడియా తెలిపింది. అయితే అలీం ఖాన్‌కు చాలా తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉందని, అయినప్పటికీ ఇటువంటి చర్యలను భారత సైన్యం ఎంతమాత్రం సహించదని తెలుస్తోంది. దోషులకు అసాధారణ శిక్ష విధించే అవకాశం ఉందని ఉన్నతాధికారులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Opposition Unity : ‘ఐ లవ్ యూ’ చెప్పేదెవరు : కాంగ్రెస్
China : చైనాలో మరో జాక్ మా సంఘటన... బావో ఫాన్ అదృశ్యం...
Updated Date - 2023-02-18T16:30:31+05:30 IST