Sudan : సూడాన్ నుంచి స్వదేశానికి బాధితులు.. భారత జవాన్లపై ప్రశంసలు..
ABN, First Publish Date - 2023-04-27T17:50:57+05:30
సైన్యం, పారామిలిటరీ మధ్య యుద్ధం జరుగుతుండటంతో సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమం ‘ఆపరేషన్ కావేరీ’
న్యూఢిల్లీ : సైన్యం, పారామిలిటరీ మధ్య యుద్ధం జరుగుతుండటంతో సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి భారతీయులను రప్పించే కార్యక్రమం ‘ఆపరేషన్ కావేరీ’ (Operation Kaveri) చురుగ్గా సాగుతోంది. భారత వైమానిక దళం విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్ హెవీ లిఫ్ట్ విమానంలో 246 మంది గురువారం స్వదేశానికి చేరుకున్నారు. సూడాన్ నుంచి వీరు సౌదీ అరేబియాలోని జెడ్డాకు చేరుకోగా, అక్కడి నుంచి ఈ విమానంలో భారత గడ్డపైకి తీసుకొచ్చారు. ఈ ఆపరేషన్‌లో తొలి బృందం బుధవారం ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే. తొలి బృందంలో 360 మంది స్వదేశీ గడ్డపై అడుగు పెట్టారు. వీరంతా తమను కాపాడినందుకు భారత మాతకు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, భారత సైన్యం, నావికా దళం సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
యుద్ధం జరుగుతున్న సూడాన్‌లో ఉంటున్న భారతీయులను సౌదీ అరేబియాలోని జెడ్డాకు రోడ్డు మార్గం ద్వారా తీసుకొస్తున్నారు. సూడాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి భారతీయులను బస్సుల్లో పోర్ట్ సూడాన్‌కు తరలిస్తున్నారు. వీరిని అక్కడి నుంచి నావికాదళ యుద్ధ నౌకల్లో జెడ్డాకు తీసుకొస్తున్నారు. జెడ్డా నుంచి మన దేశానికి తీసుకొస్తున్నారు.
హింస చెలరేగిన సూడాన్ ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్న తర్వాత భారతీయులంతా భారత్ మాతా కీ జై, ఇండియన్ నేవీ జిందాబాద్ వంటి నినాదాలు చేస్తున్నారు. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ ఆపరేషన్ కావేరీని జెడ్డాలో పర్యవేక్షిస్తున్నారు. ఆయనను చూసి వీరంతా భావోద్వేగంతో ధన్యవాదాలు చెప్తున్నారు.
సూడాన్ నుంచి ముంబైకి వెళ్తున్న C-17 Globemaster విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ, భారత ప్రభుత్వానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. సూడాన్ రాజధాని నగరం నుంచి తమను ఏ విధంగా కాపాడారో వివరించారు. ‘‘మేము జెడ్డా చేరుకున్నాం. మన జవాన్లు నిజమైన హీరోలు. వారు మాకు అన్ని రకాల ఆతిథ్యం, సేవలు అందజేశారు. ఇప్పుడు మేం ముంబై వెళ్తున్నాం. మా స్వస్థలానికి వెళ్తున్నాం. యావత్తు దేశానికి, ప్రధాన మంత్రి మోదీకి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం’’ అని తెలిపారు.
జెడ్డాకు చేరుకున్న భారతీయులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మురళీధరన్ మాట్లాడుతూ, ‘‘సూడాన్ నుంచి మీరంతా తిరిగి రావడం సంతోషం’’ అని చెప్పారు. విమానంలో కూర్చున్న భారతీయులను ఉద్దేశించి కూడా మాట్లాడారు.
సంక్షోభంలో చిక్కుకున్న సూడాన్ నుంచి ఆపరేషన్ కావేరీలో భాగంగా భారత దేశానికి తీసుకొచ్చినవారి సంఖ్య 1,700 మందికి పైగా ఉంటుంది. అక్కడ చిక్కుకున్న ప్రతి ఒక్కరినీ సత్వరమే తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా చెప్పారు. భారత ప్రభుత్వాన్ని దాదాపు 3,400 మంది భారతీయులు సంప్రదించారని చెప్పారు. వీరిలో కొందరు ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, మరికొందరు ఖార్టౌమ్‌లోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించారని చెప్పారు.
జెడ్డాలో 495 మంది, పోర్ట్ సూడాన్‌లో 320 మంది భారతీయులు ప్రస్తుతం ఉన్నారు. ఖార్టౌమ్ నుంచి పోర్ట్ సూడాన్‌కు మరికొందరు భారతీయులను బస్సుల్లో తరలిస్తున్నారు. సౌదీ అరేబియాలో రెండు సీ-130జే మీడియం లిఫ్ట్ విమానాలు ఉన్నాయి. ఇవి భారత వాయుసేనకు చెందిన విమానాలు. పోర్ట్ సూడాన్‌కు చేరుకున్న భారతీయులను జెడ్డాకు ఎర్ర సముద్రం మీదుగా తీసుకెళ్లేందుకు నావికా దళ యుద్ధ నౌకలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇదిలావుండగా, సూడాన్ మిలిటరీ, పారామిలిటరీ దళాల మధ్య ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. అంతర్యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చాలా మంది ఆందోళన చెందుతున్నారు.
ఇవి కూడా చదవండి :
దలైలామా చేతికి రామన్ మెగసెసె అవార్డు
Modi Vs Jairam Ramesh : కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన జైరామ్ రమేశ్..
Updated Date - 2023-04-27T17:50:57+05:30 IST