Sim Cards Verification: సిమ్ కార్డ్స్ జారీ విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం.. ఆ తప్పు చేస్తే రూ.10 లక్షలు ఫైన్
ABN, First Publish Date - 2023-08-17T22:43:28+05:30
ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కో ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులే తీసుకోవాలని నిబంధన ఉన్నా.. దాన్ని అతిక్రమించి..
ప్రస్తుత ఆధునిక యుగంలో సైబర్ నేరాలు ఎలా పెరిగిపోతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు. ఒక్కో ఆధార్ కార్డుపై 9 సిమ్ కార్డులే తీసుకోవాలని నిబంధన ఉన్నా.. దాన్ని అతిక్రమించి ఒకే పేరుతో వందలాది సిమ్ కార్డులు కొంటున్నారు. ఫేక్ ఐడీలపై ఇలా సిమ్ కార్డ్స్ కొని, భారీ మోసాలకు తెగబడుతున్నారు. ఈ మోసాల్ని అరికట్టేందుకు తాజాగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ని తప్పనిసరి చేసింది. అంతేకాదు.. బల్క్ కనెక్షన్స్‌ని సైతం నిలిపివేసింది.
ఈ విషయాన్ని కేంద్ర టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇప్పుడు సిమ్ కార్డ్ డీలర్లకు పోలీసు, బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని.. ఒకవేళ ఈ నిబంధనలు అతిక్రమిస్తే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని, వాళ్లు వెంటనే పోలీస్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం కొంత గడువు ఇస్తామని తెలిపారు. బల్క్ కనెక్షన్‌కి బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌ని ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొన్నారు. మోసపూరిత కాల్స్‌ను పూర్తిగా అరికట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని.. అందులో భాగంగా ఈ తాజా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.
సంచార్ సాథి పోర్టల్‌ను ప్రారంభించినప్పటి నుంచి 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రభుత్వం గుర్తించిందని.. వాటిని అప్పటికప్పుడే డీయాక్టివేడ్ చేయడం జరిగిందని వైష్ణవ్ తెలిపారు. అలాగే.. 67 వేలమంది డీలర్లను బ్లాక్ లిస్ట్ చేశామని, 2023 మే నుంచి 300 మంది సిమ్ కార్డ్ డీలర్లపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కూడా చేశామని అన్నారు. 66 వేలకు పైగా మోసపూరిత వాట్సాప్ ఖాతాల్ని సైతం బ్లాక్ చేశామన్నారు. గతంలో ప్రజలు సిమ్ కార్డులను విరివిగా కొనుగోలు చేశారని, ఆ విధానానికి స్వస్తి పలకాలని చెప్పారు. టెలికాం ఆపరేటర్‌ల ద్వారా ధృవీకరణ జరుగుతుందని.. ఒక డీలర్‌ని నియమించే ముందు వారి వ్యక్తిగత, వ్యాపార సంబంధిత పత్రాలను సేకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
Updated Date - 2023-08-17T22:43:28+05:30 IST