Modi Vs Jairam Ramesh : కాంగ్రెస్‌పై మోదీ వ్యాఖ్యలు.. ఘాటుగా బదులిచ్చిన జైరామ్ రమేశ్..
ABN, First Publish Date - 2023-04-27T15:00:48+05:30
కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిందని, గ్యారంటీ ఇచ్చే స్థితిలో ఆ పార్టీ లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై
న్యూఢిల్లీ : కాంగ్రెస్ వారంటీ గడువు ముగిసిందని, గ్యారంటీ ఇచ్చే స్థితిలో ఆ పార్టీ లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ (Jairam Ramesh) ఘాటుగా స్పందించారు. నిరాశ, నిస్పృహలతో దారుణ వ్యాఖ్యలు చేయడంలో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ తర్వాత ఇప్పుడు మోదీ వంతు వచ్చిందన్నారు.
కర్ణాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా బూత్ స్థాయి బీజేపీ (BJP) కార్యకర్తలతో ప్రధాని మోదీ గురువారం మాట్లాడారు. కాంగ్రెస్‌ను గెలిపించిన రాష్ట్రాల్లో ఆ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోసం ఆయా రాష్ట్రాల ప్రజలు ఇంకా ఎదురు చూస్తున్నారని, ఆ పార్టీ ఆ హామీలను నెరవేర్చడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఉన్న వారంటీ గడువు ముగిసిపోయిందని, ఇకపై ఎటువంటి హామీని అయినా ఇచ్చే స్థితిలో ఆ పార్టీ లేదని చెప్పారు.
జైరామ్ రమేశ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ, నిరాశ, నిస్పృహల వల్ల దారుణమైన వ్యాఖ్యలు చేయడం కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తర్వాతి వంతు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చిందన్నారు. బీజేపీ 40 శాతం కమిషన్ ప్రభుత్వానికి మే 10న కర్ణాటక ప్రజలు గ్యారంటీగా ముగింపు పలుకుతారని చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అమలు చేసినట్లుగానే కర్ణాటకలో కూడా కొద్ది రోజుల్లోనే అమలు చేస్తామన్నారు.
రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం పాత పింఛను పథకాన్ని అమలు చేసిన విషయాన్ని జైరామ్ రమేశ్ గుర్తు చేశారు. 125 రోజుల ఉపాధి హామీ పనులు, ఆరోగ్య హక్కు, చిరంజీవి యోజన వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల రుణమాఫీని అమలు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన, పాత పింఛను పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) స్పందిస్తూ, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదనడానికి గణాంక వివరాలతో సమాచారం ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ ప్రచారకర్తలుగా అవినీతిపరులు ఉన్నారని ఎద్దేవా చేశారు. పదే పదే అబద్ధాలు చెప్పి, వాటిని నిజాలుగా మార్చే ప్రయత్నం చేయడం మోదీకి అలవాటు అని తెలిపారు. అయితే ప్రజలు దీనిని అర్థం చేసుకున్నారని తెలిపారు. ఈసారి కర్ణాటకలో ఈ పాచికలు పారబోవని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
దలైలామా చేతికి రామన్ మెగసెసె అవార్డు
Chennai: చెన్నైవాసులకు ఓ గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే...
Updated Date - 2023-04-27T15:00:48+05:30 IST