Karnataka Assembly Polls: మనసులో మాట బయటపెట్టేశారు
ABN, First Publish Date - 2023-04-04T20:25:55+05:30
పొత్తులపై మాజీ ప్రధానమంత్రి, జేడీఎస్(JDS) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ(HD Devegowda) తేల్చేశారు.
బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల (Karnataka Assembly Polls) వేళ పొత్తులపై మాజీ ప్రధానమంత్రి (Former PM), జేడీఎస్(JDS) జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడ(HD Devegowda) తేల్చేశారు. తన కుమారుడు హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) ఎవ్వరితోనూ పొత్తులు పెట్టుకోరాదని నిర్ణయించారని దేవెగౌడ వెల్లడించారు. ఎన్నికల ముందు కానీ, తర్వాత కానీ పొత్తులు వద్దనుకున్నామన్నారు. కర్ణాటకలో రెండు జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ మధ్య పోరు సాగుతోందని చెప్పారు. కాంగ్రెస్‌తో కానీ, భారతీయ జనతా పార్టీతో కానీ పొత్తు పెట్టుకోబోమన్నారు. కొందరు హంగ్ వస్తుందని కూడా అంటున్నారని, అయితే సొంతంగా అధికారంలోకి రావడంపైనే దృష్టి సారించామని దేవెగౌడ చెప్పారు. సొంతంగా అధికారంలోకి వస్తేనే మ్యానిఫెస్టోలో ప్రకటించే అన్ని కార్యక్రమాలనూ దిగ్విజయంగా అమలు చేయగలుగుతామన్నారు. కర్ణాటకను ఇప్పటివరకూ పాలించిన ముఖ్యమంత్రుల్లో కుమారస్వామికే ఎక్కువ మార్కులున్నాయని దేవెగౌడ చెప్పుకొచ్చారు.
మరోవైపు జేడీఎస్ (JDS) ఇప్పటికే ఎన్నికల ప్రచారం వేగం చేసింది. అనేక చోట్ల అభ్యర్థులను ప్రకటించి వ్యూహాత్మకంగా ప్రచారం సాగిస్తోంది. రెండు జాతీయ పార్టీలనూ కాదని కన్నడ పార్టీ అయిన తమకే ప్రజలు పట్టం కడతారని జేడీఎస్ నాయకత్వం ధీమాగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్‌కు కాకుండా తమ పార్టీకే పడేలా జాగ్రత్తలు వహిస్తోంది. బీజేపీ పాలనలో వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు తాము అధికారంలోకి వస్తే రైతన్నలకు అండగా ఉంటామని జేడీఎస్ నాయకత్వం ప్రచారం చేస్తోంది.
మే 10న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 115 నుంచి 127 స్థానాలు గెలుచుకోవచ్చని ఏబీపీ ఒపీనియన్ పోల్ సర్వే తెలిపింది. ఇదే జరిగితే జేడీఎస్ అవసరం కాంగ్రెస్‌కు ఉండదు. అయితే ఓటర్ల నాడిని వంద శాతం గుర్తించడం ఏ ఒపీనియన్ పోల్‌కూ సాధ్యం కాదు. ఈ తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ మ్యాజిక్ నెంబర్ చేరుకోకపోతే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే జేడీఎస్ కింగ్‌మేకర్ పాత్రలోకి వెళ్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు కావాల్సినన్ని ఎమ్మెల్యే స్థానాల్లో బీజేపీ గెలవలేకపోయింది. అతి పెద్ద పార్టీగా నిలిచినా మ్యాజిక్ నెంబర్‌కు చేరలేకపోయింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్‌కు మద్దతివ్వడంతో కుమారస్వామి సీఎం అయ్యారు. అయితే కొంతకాలానికే ప్రభుత్వం మారిపోయింది. నెంబర్ గేమ్‌లో బీజేపీ పైచేయి సాధించడంతో కమలనాథులు అధికారం చేజిక్కించుకున్నారు.
224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్‌కు 75 మంది, జేడీఎస్‌కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి. కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Karnataka Assembly Polls: డీకే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై సిద్ధూ క్లారిటీ...
Karnataka assembly polls: కర్ణాటకలో బీజేపీ గెలిచి తీరాల్సిందే... ఎందుకంటే?
Updated Date - 2023-04-04T20:25:59+05:30 IST