Twitter : శుభవార్త చెప్పిన కంగన రనౌత్
ABN, First Publish Date - 2023-01-24T19:33:31+05:30
2021లో పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హింసాకాండ జరిగింది.
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల అనంతరం రెచ్చగొట్టే ట్వీట్లు చేసి, ట్విటర్ ఖాతాను కోల్పోయిన బాలీవుడ్ నటి కంగన రనౌత్ (Kangana Ranaut) మళ్లీ ఆ వేదికపైకి మంగళవారం వచ్చారు. మళ్లీ ఈ వేదికపైకి రావడం ఆనందంగా ఉందని ఆమె ట్వీట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో కూడా ఈ విషయాన్ని తెలిపారు. తన ట్విటర్ అకౌంట్ రీస్టోర్ అయిందని చెప్తూ, ‘ఎమర్జెన్సీ’ చిత్రీకరణ విజయవంతంగా పూర్తయిందని, అక్టోబరు 20న సినిమా థియేటర్లలో కలుద్దామని పేర్కొన్నారు.
2021లో పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హింసాకాండ జరిగింది. దీనిపై కంగన ట్విటర్ వేదికగా స్పందించారు. టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీయే ఈ హింసాకాండకు బాధ్యురాలని ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. బీజేపీపై టీఎంసీ విజయంపై కూడా కొన్ని వివాదాస్పద ట్వీట్లు చేశారు. విద్వేషపూరిత ప్రవర్తన, అబ్యూసివ్ బిహేవియర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ట్వీట్లు చేయడంతో ట్విటర్ ఆమె ఖాతాను 2021 మే 4న శాశ్వతంగా సస్పెండ్ చేసింది.
దాదాపు 20 నెలల తర్వాత మంగళవారం కంగన అకౌంట్‌ను ట్విటర్ పునరుద్ధరించింది. ఆమె స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అందరికీ హలో, ఇక్కడికి మళ్లీ రావడం బాగుంది’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-01-24T19:45:34+05:30 IST