Karnataka Election : ఓటు వేయండి.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయండి.. : ప్రముఖులు
ABN, First Publish Date - 2023-05-10T10:29:07+05:30
కర్ణాటక శాసన సభ (Karnataka Assembly) ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), జేడీఎస్
బెంగళూరు : కర్ణాటక శాసన సభ (Karnataka Assembly) ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం ప్రారంభమైంది. కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP), జేడీఎస్ (JDS) హోరాహోరీగా ప్రచారం నిర్వహించిన తర్వాత ఓటర్లు తమ తీర్పును ఇస్తున్నారు. ప్రముఖులు తమ ఓటు హక్కేును వినియోగించుకుని, ఓటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మయ్, మాజీ ముఖ్యమంత్రి బీఎస్, యడియూరప్ప, ‘ఇన్ఫోసిస్’ నారాయణ మూర్తి, ఆయన సతీమణి సుధా మూర్తి, మైసూరు రాజవంశీకురాలు ‘రాజమాతే’ ప్రమోద దేవి వడియార్, ఆరెస్సెస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలే తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నవ వధువు ఓటు ఎవరికి?
చిక్కమగళూరులోని 165వ నెంబరు పోలింగ్ బూత్‌లో ఓ నవ వధువు ఓటు వేసి, అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్ షిగ్గాన్ నియోజకవర్గంలో ఓటు వేశారు. ఆయనపై జేడీఎస్ అభ్యర్థి చన్న బసప్ప యాలిగార్, కాంగ్రెస్ అభ్యర్థి యాసిర్ అహ్మద్ ఖాన్ పఠాన్ పోటీ చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం బసవరాజ్ బొమ్మయ్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి కోసం ఓటు వేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి ప్రజలు స్పందించిన తీరు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కర్ణాటక అభివృద్ధి కోసం ఓటు వేయాలని ఓటర్లను కోరారు.
రాహుల్ గాంధీ పిలుపు
40 శాతం కమిషన్ విముక్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పిలుపునిచ్చారు. మహిళా హక్కులు, యువతకు ఉద్యోగాలు, పేదల అభివృద్ధి కోసం ఓటు వేయాలని కోరారు.
సిద్ధలింగ స్వామి ఓటు ఎవరికి?
సిద్ధ గంగ మఠం స్వామీజీ సిద్ధలింగ స్వామి తుమకూరులోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. నటుడు ప్రకాశ్ రాజ్ బెంగళూరులోని శాంతి నగర్‌లో ఉన్న సెయింట్ జోసఫ్స్ స్కూల్‌లో ఓటు వేసేందుకు వచ్చారు.
మోదీ పిలుపు
కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లు వేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కోరారు. ముఖ్యంగా తొలిసారి ఓటు హక్కు పొందినవారు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని, ప్రజాస్వామ్య ఉత్సవాన్ని పరిపుష్టం చేయాలని కోరారు.
అమిత్ షా పిలుపు
సుపరిపాలనకు ఓటు వేయాలని కేంద్ర హోం మంత్రి, బీజేపీ నేత అమిత్ షా (Amit Shah) ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సుపరిపాలన, సౌభాగ్యం, అభివృద్ధి కోసం ఓటు వేయాలని కర్ణాటకలోని సోదర, సోదరీమణులను కోరుతున్నానని చెప్పారు. ‘‘మీరు వేసే ఒక ఓటు ప్రజలకు అనుకూలమైన, అభివృద్ధికి అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి, రాష్ట్రాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్ళడాన్ని కొనసాగించడానికి దారి తీస్తుందని చెప్పారు.
ఇదే ప్రజల నిర్ణయం : ఖర్గే
కర్ణాటకలో ప్రగతిశీల, పారదర్శక, సంక్షేమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలు నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjun Kharge) చెప్పారు. ఇది పెద్ద సంఖ్యలో ఓట్లు వేయవలసిన సమయమని చెప్పారు. తొలిసారి ఓటు హక్కు పొందినవారిని స్వాగతించారు. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రజాస్వామిక ప్రక్రియలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
బీజేపీ గెలుపు తథ్యం : యెడియూరప్ప
మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప తన కుటుంబ సభ్యులతో కలిసి రాఘవేంద్ర స్వామి మఠంలో పూజలు చేశారు. అనంతరం షికర్‌పూర్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. యెడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ, తన కుమారుడు విజయేంద్ర 40 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుస్తారన్నారు. రాష్ట్రంలో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు.
224 శాసన సభ నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్, కాంగ్రెస్ ప్రధానంగా పోటీపడుతున్నాయి. 5,31,33,054 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,67,28,053 మంది పురుషులు కాగా, 2,64,00,074 మంది మహిళలు. రాష్ట్రంలో 58,545 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 2,615 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాని మోదీ 19 బహిరంగ సభల్లో బీజేపీ తరపున ప్రచారం చేశారు. బెంగళూరులో రోడ్‌షో నిర్వహించారు.
ఇవి కూడా చదవండి :
Chief Minister: వారిని క్షేమంగా ఇళ్లకు చేర్చుతాం..
Updated Date - 2023-05-10T10:30:27+05:30 IST