Canada : ఇందిరా గాంధీ హత్యోదంతం.. కెనడాలో సంబరాలు..

ABN , First Publish Date - 2023-06-08T11:59:03+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యను కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు సంబరంగా జరుపుకున్నట్లు వచ్చిన వార్తలపై

Canada : ఇందిరా గాంధీ హత్యోదంతం.. కెనడాలో సంబరాలు..
Khalistani Parade

న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్యను కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు సంబరంగా జరుపుకున్నట్లు వచ్చిన వార్తలపై న్యూఢిల్లీలోని కెనడియన్ హై కమిషనర్ కామెరూన్ మెక్‌కే ఘాటుగా స్పందించారు. కెనడాలో విద్వేషానికి, హింసను ఘనంగా కీర్తించడానికి తావు లేదన్నారు. ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది 1984లో అత్యంత దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

‘ఆపరేషన్ బ్లూస్టార్’లో భాగంగా 1984 జూన్ 6న భారతీయ దళాలు స్వర్ణ దేవాలయంలోకి ప్రవేశించాయి. అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె భద్రతా సిబ్బంది 1984 అక్టోబరు 31న అత్యంత దారుణంగా హత్య చేశారు. ‘ఆపరేషన్ బ్లూస్టార్’ను గుర్తు చేసుకుంటూ ఖలిస్థాన్ మద్దతుదారులు జూన్ 4న కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఓ పెరేడ్‌ను నిర్వహించినట్లు తెలిపే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 39 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఖలిస్థాన్ మద్దతుదారులు ఈ పెరేడ్‌ను నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి. ఈ పెరేడ్‌లో ఇందిరా గాంధీతోపాటు, ఆమెను హత్య చేసినవారి బొమ్మలను కూడా పెట్టారు. ఇందిర హత్య తీరును వర్ణిస్తూ ఈ పెరేడ్‌ జరిగింది. శ్రీ దర్బార్ సాహిబ్‌పై దాడి చేసినందుకు ప్రతీకారంగానే ఆమెను హత్య చేసినట్లు ఈ పెరేడ్ నిర్వాహకులు ఓ సందేశాన్ని ఇచ్చారు.

కెనడాలోని బ్రాంప్టన్‌లో ఖలిస్థాన్ మద్దతుదారులు నిర్వహించిన పెరేడ్‌పై భారత ప్రభుత్వం బుధవారం తీవ్ర అసంతృప్తి, విచారం వ్యక్తం చేసింది. కెనడా ప్రభుత్వానికి తన అసంతృప్తిని తెలిపింది. ఒట్టావాలోని ఇండియన్ హై కమిషన్ బుధవారం గ్లోబల్ అఫైర్స్ కెనడాకు ఓ ఫార్మల్ నోట్‌ను పంపించింది. ఇటువంటి చర్యలు ఆమోదించదగినవి కాదని స్పష్టం చేసింది. వాక్ స్వాతంత్ర్యం పరిధిని అతిక్రమించకూడదని తెలిపింది. ఓ ప్రజాస్వామిక దేశపు నాయకురాలి హత్యను ఘనంగా కీర్తిస్తూ పెరేడ్ నిర్వహించడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని కెనడియన్ హై కమిషనర్ కామెరూన్ మెక్‌కే గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశ మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ హత్యను కెనడాలో జరిగిన ఓ కార్యక్రమంలో సంబరంగా జరుపుకున్నట్లు వచ్చిన వార్తలను చూసి, తాను దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. విద్వేషానికి, హింసను ఘనంగా కీర్తించడానికి కెనడాలో స్థానం లేదన్నారు. తాను ఈ చర్యలను నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Air India flight : రష్యాలో చిక్కుకున్న ఎయిరిండియా ప్రయాణికులకు ఎట్టకేలకు విముక్తి

Wrestlers Protest : బ్రిజ్ భూషణ్‌పై ‘మైనర్’ రెజ్లర్ కొత్త స్టేట్‌మెంట్

Updated Date - 2023-06-08T12:05:57+05:30 IST