Rajastan : రాజస్థాన్ నేతలతో కాంగ్రెస్ అధిష్ఠానం భేటీ
ABN, First Publish Date - 2023-07-06T14:25:26+05:30
రాజస్థాన్ శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు గురువారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు.
న్యూఢిల్లీ : రాజస్థాన్ శాసన సభ ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మరోసారి విజయం సాధించడం కోసం వ్యూహాలను రచించేందుకు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ అగ్ర నేతలు గురువారం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, యువ నేత సచిన్ పైలట్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్, రాజస్థాన్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి సుఖ్‌జిందర్ రణధవా, ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గోవింద్ సింగ్, సచిన్ పైలట్, మరికొందరు సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అశోక్ గెహ్లాట్ వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ ఏడాది శాసన సభ ఎన్నికలు జరిగే మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల కాంగ్రెస్ నేతలతో మల్లికార్జున ఖర్గే వరుసగా సమావేశమవుతున్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాల రచనపై చర్చిస్తున్నారు. సచిన్ పైలట్ చాలా కాలం నుంచి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. బీజేపీ నేత వసుంధర రాజే సింథియా అవినీతిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు మే నెలలో ఖర్గే, రాహుల్ వీరితో చర్చలు జరిపారు. ఖర్గే నివాసంలో వీరిద్దరూ కలిసి ఫొటోలు దిగారు. రానున్న శాసన సభ ఎన్నికలను సమైక్యంగా ఎదుర్కొనేందుకు వీరిద్దరూ అంగీకరించినట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇరువురి సమస్యల పరిష్కార బాధ్యతను పార్టీ హై కమాండ్‌కు వదిలిపెట్టినట్లు తెలిపింది.
2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి గెహ్లాట్, పైలట్ మధ్య జగడం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి పదవి కోసం పైలట్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. 2020లో తిరుగుబాటు చేయడంతో పైలట్‌ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి, రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తొలగించారు.
వసుంధర రాజే ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించడంలో గెహ్లాట్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ పైలట్ గత నెలలో నిరాహార దీక్ష చేశారు. పార్టీ అధిష్ఠానం వారించినప్పటికీ ఆయన ఈ దీక్షను కొనసాగించారు.
ఇవి కూడా చదవండి
Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..
Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్
Updated Date - 2023-07-06T14:25:26+05:30 IST