Maharashtra : షిండే, ఉద్ధవ్ వర్గాల ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు
ABN, First Publish Date - 2023-07-08T12:52:20+05:30
శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్శ నివారం స్పందించారు.
ముంబై : శివసేన పార్టీని చీల్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలనే డిమాండ్లపై మహారాష్ట్ర శాసన సభ సభాపతి రాహుల్ నార్వేకర్ (Rahul Narwekar) శనివారం స్పందించారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) నేతృత్వంలోని శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కోరినట్లు తెలిపారు.
భారత ఎన్నికల కమిషన్ నుంచి శివసేన రాజ్యాంగం తనకు అందినట్లు రాహుల్ నార్వేకర్ శుక్రవారం చెప్పారు. ముఖ్యమంత్రి షిండేతో సహా 16 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ త్వరలో ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేలకు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సత్వర విచారణ జరపాలని శాసన సభ సభాపతిని ఆదేశించాలని ఇటీవల శివసేన (యూబీటీ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 2022 జూన్ నెలలో షిండే వర్గం బీజేపీతో చేతులు కలిపి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే సమయంలో శివసేన పార్టీ చీలిపోవడానికి ముందు ఆ పార్టీ చీఫ్ విప్‌గా పని చేసిన ఎమ్మెల్యే సునీల్ ప్రభు అదే హోదాలో ఏక్‌నాథ్ షిండే, మరో 15 మంది ఎమ్మెల్యేలను శాసన సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ శాసన సభ స్పీకర్‌కు పిటిషన్లను సమర్పించారు. సుప్రీంకోర్టు మే 11న ఇచ్చిన తీర్పులో ఏక్‌నాథ్ సిండే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగవచ్చునని చెప్పింది. షిండే తిరుగుబాటు చేసిన తర్వాత శాసన సభలో బలపరీక్షను ఎదుర్కొనడానికి ముందే ఉద్ధవ్ థాకరే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినందువల్ల మహా వికాస్ అగాడీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని తెలిపింది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : పొలంలో దిగి, నాట్లు వేసి, రైతులతో ఆత్మీయంగా మాట్లాడిన రాహుల్ గాంధీ
Updated Date - 2023-07-08T12:52:20+05:30 IST