Onion Farmers: ఉల్లి రైతులకు 50 శాతం ఉపశమనం...
ABN, First Publish Date - 2023-03-13T17:58:54+05:30
పండించిన పంటకు కనీసం పెట్టుబడి రేటు కూడా దక్కక ఉల్లి రైతులు రోడ్డెక్కడం, బస్తాలకు బస్తాలు రోడ్లపైకి విసిరేసి పంటను..
ముంబై: పండించిన పంటకు కనీసం పెట్టుబడి రేటు కూడా దక్కక ఉల్లి రైతులు రోడ్డెక్కడం, బస్తాలకు బస్తాలు రోడ్లపైకి విసిరేసి పంటను తగులబెట్టడం, మూడోసారి 'లాంగ్ మార్చ్'కు పిలుపునివ్వడంతో మహారాష్ట్ర సర్కార్ దిగొచ్చింది. ఉల్లి రైతులకు క్వింటాల్‌కు రూ.300 చొప్పున సబ్సిడీని ప్రకటించింది. ఉల్లి రైతులు క్వింటాల్‌కు రూ.600 సబ్సిడీకి డిమాండ్ చేయగా, ప్రభుత్వం అందులో సగం మాత్రమే (రూ.300) సబ్సిడీ ప్రకటించడం విశేషం.
ఉల్లి రైతులకు సబ్సిడీ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బాధిత రైతులకు ఉపశమనం కలుగుతుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సోమవారంనాడు అసెంబ్లీలో తెలిపారు. ''కరీఫ్ సీజన్‌లో ఎర్ర ఉల్లిపాయలు పెద్ద ఎత్తున మార్కెట్‌లోకి వచ్చాయి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉల్లి దిగుబడి పెరిగింది. డిమాండ్‌కు మించి సరఫరా ఉండటం ధరల పతనానికి దారితీసింది'' అని ఆయన తెలిపారు.
రైతులకు మద్దతుగా ఎంవీఏ
కాగా, క్వింటాల్‌కు రూ.600 సబ్సిడీ ప్రకటించాలంటూ ఉల్లిరైతుల డిమాండ్‌కు మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) మద్దతు ప్రకటించింది. వచ్చే సీజన్‌కు క్వింటాల్కు రూ.2,000 కనీస మద్దతు ధర ఇవ్వాలని కూడా డిమాండ్ చేసింది. అయితే ఉల్లిపాయలు పాడైపోయే పంట కాదంటూ కనీస మద్దతు ధర డిమాండ్‌ను షిండే ప్రభుత్వం తోసిపుచ్చింది. సబ్సిడీ కనీసం రూ.500 అయినా ఇవ్వాలని ఛగన్ భుజ్‌బల్ వంటి ఎంవీఏ నేతలు డిమాండ్ చేశారు. కాగా, హోల్‌సేల్ మార్కెట్‌లో ఉల్లిధర కంటనీరు తెప్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాసిక్ జిల్లాలో రైతులు సోమవారంనాడు తమ పంటను తుగలబెడుతూ నిరసన వ్యక్తం చేసారు. ఈ హోలికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రికి ఇన్విటేషన్ కార్డు కూడా పంపారు.
Updated Date - 2023-03-13T18:00:41+05:30 IST