Mamata Banerjee: ఆ నిర్ణయమే కాంగ్రెస్ కొంపముంచింది.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-12-04T16:28:42+05:30
హిందీ గడ్డపై మూడు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో..
Mamata Banerjee: హిందీ గడ్డపై మూడు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్) జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోరాడాలని కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమే కొంపముంచిందని పేర్కొన్నారు. ఇండియా కూటమిలోని సభ్యులతో సీట్లు పంచుకోకపోవడం వల్లే ఆ పార్టీ ఓటమి చవిచూసిందని అన్నారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ పరాజయం మాత్రమేనని, ప్రజల ఓటమి కాదని ఆమె నొక్కి చెప్పారు.
అసెంబ్లీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించింది. ఒకవేళ వాళ్లు ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సీట్లు పంచుకుని ఉండుంటే.. బహుశా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లోనూ గెలుపొందేవారు. కానీ.. మిత్రపక్షాలతో సీట్లు పంచుకోకుండా ఒంటరిగా రంగంలోకి దిగడంతో ఓట్లు చీలాయి. ఇది వాస్తవం. ఎన్నికల ముందు సీట్ల పంపకాల విషయంపై మేము కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చాం. కానీ.. వాళ్లు పట్టించుకోలేదు. ఓట్లు చీలిపోవడం వల్లే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఆ మూడు రాష్ట్రాల్లో ఓడిపోయారు’’ అని వివరించారు.
ఐడియాలజీతో పాటు సరైన వ్యూహం కూడా ఉండాలని మమతా బెనర్జీ సూచించారు. సీట్ల పంపకం కుదిరితే.. 2024లో జరిగే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాదని ఆమె అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలోపు ఇండియా కూటమిలోని పార్టీలన్ని కలిసి పని చేసి, తప్పులను సరిదిద్దుకుంటామని అన్నారు. ఈ ఎన్నికల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమిలోని పార్టీలు కలిసికట్టుగా పని చేస్తేనే.. బీజేపీని ఓడించగలమని మమతా బెనర్జీ ఉద్ఘాటించారు.
ఇదిలావుండగా.. మధ్యప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ పార్టీతో కలిసి రంగంలోకి దిగాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కానీ.. సీట్ల పంపకాలపై చర్చలు చేయకుండానే కాంగ్రెస్ రంగంలోకి దిగింది. అదే సమయంలో.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీనియర్ నేత, ముఖ్యమంత్రి అభ్యర్థి కమల్ నాథ్ పొత్తు ప్రశ్నలకు బదులిస్తూ ‘అఖిలేశ్ విఖిలేశ్‌లను పక్కన పెట్టేయండి’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ అవమానకరమైన పదాలే కాంగ్రెస్ ఓటమికి కారణమని, ఆ అప్రతిష్ట వ్యాఖ్యల వల్లే కాంగ్రెస్ ఓడిందని సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి మనోజ్ యాదవ్ కాకా మండిపడ్డారు.
Updated Date - 2023-12-04T16:28:43+05:30 IST