Mamata Banerjee: సిక్కిం వరదలపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆందోళన.. ఆదుకుంటామన్న దీదీ
ABN, First Publish Date - 2023-10-04T16:34:13+05:30
సిక్కింలో గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో లాచెన్ లోయలోని తీస్తా నది ఉప్పొంగిన విషయం విదితమే. దీంతో ఆ ప్రాంతంలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటనలపై వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు.
గ్యాంగ్ టక్: సిక్కిం(Sikkim)లో గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో లాచెన్ లోయలోని తీస్తా నది ఉప్పొంగిన విషయం విదితమే. దీంతో ఆ ప్రాంతంలో వరదలు జనావాసాలను ముంచెత్తాయి. ఈ వరదల్లో(Floods) 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతయ్యారు. ఈ ఘటనలపై వెస్ట్ బెంగాల్(West Bengal) ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం బాధితులకు అండగా నిలుస్తుందని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ(Mamata Benerjee) వెల్లడించారు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను నివారించడానికి ప్రభుత్వాలు ముందుగానే అప్రమత్తం కావాలని ఆమె కోరారు. అక్కడి అధికారులతో టచ్ లో ఉండాలని ఇప్పటికే ఆదేశించినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఆమె ఎక్స్(X) లో పోస్ట్ చేశారు.
గల్లంతైన జవాన్ల అచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆర్మీ పేర్కొంది. ఈ వరదల కారణంగా మొత్తం 41 వాహనాలు నీటిలో మునిగిపోయినట్లు వెల్లడించింది. భారీ వర్షాల కారణంగా ప్రస్తుతం వరదలు సంభవించిన ప్రాంతంలో ఇంటర్నెట్ సదుపాయం కూడా సరిగ్గా లేదు. దీంతో గల్లంతైన సిబ్బందిని గుర్తించడం కష్టంగా మారిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సిక్కింలో రాత్రంతా భారీ వర్షం కురిసింది. దీంతో ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు ఉప్పొంగడంతో తీస్తా నదిలో నీటి మట్టాలు పెరిగాయి. కాగా తీస్తా నది బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించే ముందు సిక్కిం, పశ్చిమ బెంగాల్ గుండా ప్రవహిస్తుంది. తీస్తా నది ఉగ్రరూపం దాల్చడంతో సింగ్తమ్ ఫ్రూట్ బ్రిడ్జి కుప్పకూలింది. సిక్కిం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలను కలిపే 10వ నంబర్ జాతీయ రహదారి సైతం చాలా చోట్ల కొట్టుకుపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో సిక్కిం ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. తీస్తా నది పరివాహక ప్రాంతంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని సూచించింది. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించి సహాయక చర్యలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమంగ్ తెలిపారు.
Updated Date - 2023-10-04T16:38:30+05:30 IST