Mamata Banerjee: ముకుల్ రాయ్ విషయంపై స్పందించిన మమత
ABN, First Publish Date - 2023-04-19T17:53:58+05:30
ముకుల్ రాయ్ విషయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే (West Bengal legislator) ముకుల్ రాయ్ (Mukul Roy) విషయంపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (TMC supremo Mamata Banerjee) స్పందించారు. ముకుల్ రాయ్ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్‌పై గెలిచారని, ఆయన ఇప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే అని మమత చెప్పారు. కావాలనుకుంటే మళ్లీ బీజేపీలోకి వెళ్లిపోవచ్చన్నారు. ముకుల్ తృణమూల్ నేత కాదన్నారు.
మరోవైపు తాను బీజేపీ ఎమ్మెల్యేనని, బీజేపీకి రాజీనామా చేయలేదని ముకుల్ రాయ్ స్పష్టం చేశారు. బీజేపీ తనకు బాధ్యతలు అప్పగిస్తే నిర్వర్తించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ముకుల్ రాయ్ చెప్పారు.
అయితే ఒకసారి బీజేపీ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి చేర్చుకోవడం సరికాదని బీజేపీ సీనియర్ నేత, పశ్చిమబెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి అభిప్రాయపడ్డారు. అంతకన్నా బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిసారిస్తామన్నారు.
అంతకు ముందు తన తండ్రి ముకుల్ రాయ్ కనిపించడం లేదని ఆయన కుమారుడు సుభ్రాంశు రాయ్ (Subhranshu Roy) పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. కాసేపటికే ఆయన ఢిల్లీ విమానాశ్రయంలో కనిపించారు. దీనిపై సుభ్రాంశు రాయ్ స్పందిస్తూ, తన తండ్రి అనారోగ్యాన్ని తమకు అనుకూలంగా మలచుకుని, చిల్లర రాజకీయాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
మాజీ కేంద్రమంత్రి ముకుల్ రాయ్ తొలుత టీఎంసీ నుంచి బీజేపీలో చేరారు. 2021లో బీజేపీ టికెట్‌పై గెలిచినా శాసన సభ ఎన్నికల్లో టీఎంసీ విజయం సాధించడంతో మళ్లీ టీఎంసీలోకి వెళ్లిపోయారు.
2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముకుల్ రాయ్ బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.
Updated Date - 2023-04-19T17:54:01+05:30 IST