Manish Sisodia : మనీశ్‌ సిసోడియా సీబీఐ కస్టడీకి

ABN , First Publish Date - 2023-02-28T02:39:29+05:30 IST

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల రిమాండ్‌ విధించింది.

Manish Sisodia : మనీశ్‌ సిసోడియా సీబీఐ కస్టడీకి

5 రోజుల రిమాండ్‌.. 4 వరకు కస్టడీ

మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు

ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆప్‌ ఆందోళన

‘అదానీ’ నుంచి దృష్టి మళ్లించేందుకే

సిసోడియా అరెస్టు: ఆప్‌ విమర్శ

సీబీఐ అధికారులకూ అరెస్టు ఇష్టం లేదు

రాజకీయ ఒత్తిడితోనే చేశారు: కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాకు సీబీఐ ప్రత్యేక కోర్టు ఐదు రోజుల రిమాండ్‌ విధించింది. ఢిల్లీ ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకల వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం సిసోడియాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆయన్ను రౌజ్‌ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దర్యాప్తు సమయంలో పొంతనలేని సమాధానాలు చెప్పారని, తమ వద్ద ఉన్న ఆధారాలకు ఆయన చెబుతున్న సమాధానాలకు సరిపోలడం లేదని సీబీఐ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మద్యం విధానం కోసం రూపొందించిన ముసాయిదా నోటీసుల్లో న్యాయ నిపుణుల అభిప్రాయాలను సిసోడియా తొలగించారని ఆరోపించారు. తమ ప్రశ్నలకు దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తు ముందుకెళ్లాలంటే ఆయన్ను ఐదు రోజుల కస్టడీకి అప్పగించాలని కోరారు.

సిసోడియా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీలో మార్పులను లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదించారని, సీబీఐ మాత్రం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం వెంట పడుతోందని తెలిపారు. సిసోడియాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లేవన్నారు. కస్టడీకి ఇవ్వాలన్న సీబీఐ అభ్యర్థనను వ్యతిరేకించారు. ‘ఆయన ఢిల్లీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. బడ్జెట్‌ను ప్రవేశపెట్టాల్సి ఉంది. నిన్న (ఆదివారం) ఏం జరిగింది? ఆయన్ను ఎందుకు కస్టడీలో ఉంచాల్సి వచ్చింది? రాబోయే రోజుల్లో మళ్లీ విచారణకు ఆయన అందుబాటులో ఉండరా? ఆయన్ను ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారా? ఇది ఓ వ్యక్తిపై దాడి. అలాగే వ్యవస్థపై కూడా. రిమాండ్‌ సరికాదు’ అని సిసోడియా తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ కేసులో సిసోడియా ప్రమేయం ఏమీ లేదని స్పష్టం చేశారు. అయితే ఈ కేసు విచారణ సమర్థంగా జరగాలంటే సిసోడియా కస్టడీ అవసరమని సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. తన ప్రమేయం ఏమీ లేదని సిసోడియా చెబుతున్నారని.. దర్యాప్తులో మాత్రం ఆయన వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకున్నట్లు తేలిందని వెల్లడించారు. దాదాపు గంటసేపు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ప్రత్యేక కోర్టు జడ్జి ఎంకే నాగ్‌పాల్‌ తీర్పును రిజర్వ్‌ చేశారు. సాయంత్రం సిసోడియాకు ఐదు రోజుల పాటు రిమాండ్‌ విధిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 4 వరకు ఆయన్ను సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆప్‌ శ్రేణుల ఆందోళనల నేపథ్యంలో భారీ భద్రత నడుమ సిసోడియాను కోర్టుకు తీసుకెళ్లారు.

సీబీఐ అధికారులకూ ఇష్టం లేదు: కేజ్రీ

సిసోడియా అరెస్టును చాలా మంది సీబీఐ అధికారులే వ్యతిరేకిస్తున్నారని ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అన్నారు. రాజకీయ ఒత్తిడితోనే ఆయన్ను అరెస్టు చేశారని ట్విటర్‌లో ఆరోపించారు. చాలా మంది అధికారులకు సిసోడియా అంటే గౌరవమని, రాజకీయ బాస్‌లు చెప్పినట్లు చేయాలి కాబట్టే వారు అరెస్టు చేశారని పేర్కొన్నారు. అదానీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేంద్ర ప్రభుత్వం సిసోడియాను అరెస్టు చేయించిందని ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితులు ఎమర్జెన్సీ కాలాన్ని తలపిస్తున్నాయని ధ్వజమెత్తారు. కాగా, కేజ్రీవాల్‌ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వాస్తవాలను మార్చి చెప్పడంలో కేజ్రీవాల్‌ దిట్ట అని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఆరోపించారు. మద్యం కేసులో చట్టం తనపని తాను చేసుకుపోతుందని, అందుకే కేజ్రీవాల్‌ భయపడుతున్నారని విమర్శించారు.

ఆప్‌ ఆందోళనలు.. అరెస్టులు

సిసోడియా అరెస్టును నిరసిస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ కార్యకర్తలు ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. సోమవారాన్ని బ్లాక్‌ డేగా పేర్కొన్నారు. బీజేపీ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సహా పంజాబ్‌, ఒడిసా, జమ్మూకశ్మీర్‌ తదితర రాష్ట్రాలు, కొన్ని ఇతర నగరాల్లోనూ ఆప్‌ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. హైదరాబాద్‌లోనూ ఆప్‌ నాయకులు బీజేపీ కార్యాలయ ముట్టడికి యత్నించారు.

‘మోదీ-అదానీ’ బంధం నుంచి దృష్టి మళ్లించేందుకే

సిసోడియా అరెస్టును ఖండిస్తున్నాం: కేసీఆర్‌

మద్యం కేసుపై తొలిసారి అరెస్టును ఖండిస్తున్నాం: కేసీఆర్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): సిసోడియా అరెస్టును ఖండిస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను సీబీఐ ద్వారా అరెస్టు చేయించిందన్నారు. ఈ చర్య ప్రధాని మోదీకి, అదానీకి మధ్య ఉన్న సంబంధం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి చేసిందే తప్ప మరొకటి కాదన్నారు. ఢిల్లీ మద్యం కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌ స్పందించడం ఇదే తొలిసారి. సిసోడియా అరెస్టును ఝార్ఖండ్‌ సీఎం సోరెన్‌ తప్పుపట్టారు. ఈ చర్య ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అణగదొక్కడమేనని పేర్కొన్నారు. కేరళ సీఎం విజయన్‌.. సిసోడియా అరెస్టును ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణించారు. దేశంలో ప్రస్తుతం భయానక, హింసాత్మక వాతావరణం ఉందని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ అన్నారు.

Updated Date - 2023-02-28T03:52:59+05:30 IST