Rahul Gandhi Disqualification: ఒకేతాటిపైకి వచ్చిన ప్రతిపక్షాలు
ABN, First Publish Date - 2023-03-24T19:24:30+05:30
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుతో(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వం రద్దుతో(Disqualification of Rahul Gandhi as Lok Sabha MP) ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపైకి వచ్చాయి. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్, ఉద్ధవ్ శివసేన వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేతో పాటు అనేక పార్టీల నేతలు ఇప్పటికే రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ సెక్రటరీ జనరల్ రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. కాంగ్రెస్‌తో కలిసి నడిచేందుకు ఇష్టపడని నేతలు కూడా రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని తప్పుబట్టారు. బీజేపీయేతర పార్టీల నేతల్లో ఎక్కువ మంది రాహుల్ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండించారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమంటూ తీవ్రంగా విమర్శించారు కూడా. క్రమంగా కాంగ్రెస్‌తో కలిసి ఐక్యపోరాటం చేసేందుకు వీరు సిద్ధమౌతున్నారు. మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని ఆప్ అధినేత కేజ్రీవాల్ పిలుపునీయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మరోవైపు ఇప్పటికే ఈడీ(ED), సీబీఐ(CBI) వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందంటూ 14 ప్రతిపక్ష పార్టీలకు(14 political parties) చెందిన ప్రతినిధులు సుప్రీంకోర్టును(Supreme Court) ఆశ్రయించారు. ప్రతిపక్ష నేతలపై సీబీఐ, ఈడీ తప్పుడు కేసులు పెడుతున్నాయంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీకి అపరిమిత అధికారాలు ఇచ్చారంటూ విపక్షాల ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్షాల పిటిషన్‌పై ఈ నెల ఐదున విచారణ జరుపుతామని సుప్రీంకోర్ట్ వెల్లడించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 5న దీనిపై విచారణ చేపట్టేందుకు అంగీకరించింది.
దీనికి సంబంధించిన పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ న్యాయవాది అశిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు. అరెస్ట్‌కు ముందు, తర్వాత మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నేతలపై 95 శాతం కేసులు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేనని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజకీయ పార్టీల ప్రతినిధులు పేర్కొంటున్నారని సింఘ్వీ చెప్పారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన 14 పార్టీల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు డీఎంకే, రాష్ట్రీయ జనతాదళ్, భారత్ రాష్ట్ర సమితి, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన ఉద్ధవ్ వర్గం, జార్ఖండ్ ముక్తి మోర్చా, జేడియూ, సీపీఐ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ ఉన్నాయి.
సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే క్రమంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యత పెరిగిందనేది వాస్తవమే కానీ బీజేపీయేతర పార్టీల్లో నవీన్ పట్నాయక్ సారధ్యంలోని బిజూ జనతాదళ్, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ, చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే తదితర పార్టీలు మాత్రం సుప్రీం పిటిషన్‌కు మద్దతు ప్రకటించలేదు. తద్వారా కాంగ్రెస్‌కు, బీజేపీకి సమదూరం పాటించాయి. బీజేపీయేతర కాంగ్రెస్ కూటమిలో చేరకుండా ఉన్న ఈ పార్టీలు ఎన్నికలు సమీపించేనాటికి బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలుగానే ఉండిపోతాయా లేక ఏదైనా కూటమిలో చేరతాయా అనేది స్పష్టమౌతుంది.
Updated Date - 2023-03-24T19:38:37+05:30 IST