BJP: ఎన్నికలు జరిగిన 3 ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు
ABN, First Publish Date - 2023-03-03T20:26:06+05:30
తాజాగా మేఘాలయ సంకీర్ణ సర్కారులో బీజేపీ కూడా చేరింది.
న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ(BJP) జెండా రెపరెపలాడింది. మూడు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కమలం పార్టీ ఇప్పటికే రెండు చోట్ల జయకేతనం ఎగురవేసింది. నాగాలాండ్(Nagaland), త్రిపుర(Tripura)లో బీజేపీ కూటమి విజయం సాధించగా మేఘాలయ(Meghalaya )లో హంగ్ ఏర్పడింది. అయితే తాజాగా మేఘాలయ సంకీర్ణ సర్కారులో బీజేపీ కూడా చేరింది. తనకు బీజేపీ సభ్యులు కూడా మద్దతిచ్చారంటూ నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP)అధినేత, ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా(Conrad Sangma) మద్దతు లేఖలతో మేఘాలయ గవర్నర్ ఫాగు చౌహాన్(Governor Phagu Chauhan)ను కలిశారు. తనకు బీజేపీతో పాటు హెచ్ఎస్‌పీడీపీ(HSPDP) సభ్యులు, ఇద్దరు ఇండిపెండెంట్లు(Independents) కూడా మద్దతిచ్చారంటూ ఆయన మద్దతు లేఖలను గవర్నర్‌కు సమర్పించారు. మేఘాలయ రాష్ట్రంలోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 59 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్ర సీఎం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ అభ్యర్థులు 26 స్థానాల్లో గెలిచారు. ఎన్‌పీపీ రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. యూడీపీ (యునైటెడ్ డెమొక్రటిక్ పార్టీ) 11 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ 5, బీజేపీ 2 చోట్ల గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా కాన్రాడ్ సంగ్మాకు బీజేపీ కూడా మద్దతునీయడంతో త్రిపుర, నాగాలాండ్, మేఘాలయలోనూ కమల వికాసం జరిగినట్లైంది. మూడు ప్రభుత్వాల్లోనూ బీజేపీ కొలువుతీరనుంది.
త్రిపురలో బీజేపీ కూటమి విజయం సాధించింది. బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి మానిక్ షా వరుసగా రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. బీజేపీ కూటమి 33 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్-వామపక్షాల కూటమి 14 సీట్లలో, మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్ బిక్రమ్ వర్మ సారథ్యంలోని తిప్రా మోథ పార్టీ 13 స్థానాల్లో గెలిచాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రె్‌స(టీఎంసీ) అన్నిచోట్లా ఓడింది. టీఎంసీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా 33 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ కూటమి వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చింది. 55 స్థానాల్లో బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థులు 32 చోట్ల గెలవగా, ఐపీఎఫ్‌టీ ఒకచోట గెలుపొందింది. బీజేపీకి 38.97 శాతం ఓట్లు వచ్చాయి. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తిప్రా మోథ గిరిజన ఓటర్లను ఆకర్షించి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపింది. తిప్రామోథ తమకు మద్దతు తెలిపితే ప్రత్యేక రాష్ట్రం మినహా వారి అన్ని డిమాండ్లను అంగీకరిస్తామని బీజేపీ ప్రకటించింది.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయం సాధించింది. 60 స్థానాలకు గానూ ఎన్‌డీపీపీ- బీజేపీ కూటమి 37 స్థానాల్లో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకుంది. బీజేపీ 12 స్థానాల్లో, నేషనలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీపీ) 25 స్థానాల్లో గెలిచాయి. ఈ విజయంతో నాగాలాండ్ రాజకీయ దిగ్గజం, నేషనలిస్ట్ డెమొక్రటిక్ పార్టీ(ఎన్‌డీపీపీ) అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నెయిఫియు రియో వరుసగా ఐదో సారి సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు.
బీజేపీ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి, వాటి పని తీరు, పార్టీ కార్యర్తల నిబద్ధత.. ఈ మూడింటి వల్లే ఎన్నికల్లో బీజేపీ వరుస విజయాలు సాధిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు.
Updated Date - 2023-03-03T20:33:22+05:30 IST